వెస్టిండీస్‌కు భారీ షాక్!

20 Sep, 2017 10:04 IST|Sakshi
వెస్టిండీస్‌కు భారీ షాక్!

వన్డే క్రికెట్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ అయిన జట్టు వెస్టిండీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019 వన్డే ప్రపంచ కప్‌నకు నేరుగా క్వాలిఫై అయ్యే జట్లలో విండీస్ స్థానం కోల్పోయింది. బెయిర్ స్టో అద్బుత శతకంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విండీస్ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విండీస్ ఓటమి లంక జట్టులో ఆశలు రేపుతోంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో చివరి స్థానంలో ఉన్న లంక నేరుగా అర్హత సాధించింది.

ప్రస్తుతం లంక జట్టు 86 పాయింట్లు, విండీస్ 78 పాయింట్లతో ఉన్నాయి. అయితే 2019 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాలంటే ఈ సెప్టెంబర్ 30లోగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉండాలి. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను విండీస్ 5-0తో గానీ, 4-0తో గానీ ముగిస్తే కరీబియన్ జట్టు టాప్‌-8లో నిలిచి క్వాలిఫై మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత సాధించేది. తొలి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన విండీస్ ఇతర మ్యాచ్‌లలో విజయాలు సాధించినా ఆ జట్టు నేరుగా క్వాలిఫై కాదు. దీంతో 2018లో నిర్వహించే క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో రాణించి 2019 వన్డే ప్రపంచ కప్‌ బరిలో నిలవాల్సి ఉంటుంది.

రెండుసార్లు ప్రపంచ విజేతగా (1975, 1979) నిలిచిని, మరోసారి ఫైనల్‌ (1983)కు చేరి తమ సత్తా చాటిన జట్టు వెస్టిండీస్. గతంలో ప్రత్యర్థుల పాటి సింహస్వప్నంగా ఉన్న ఆ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. టెస్టులు, వన్డేల్లో పూర్తిగా విఫలమవుతున్న కరీబియన్లు తమకు అచ్చొచ్చిన ట్వంటీ20 ఫార్మాట్‌లో మాత్రం చెలరేగుతున్నారు. ఈ ఫార్మాట్‌లో రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన విండీస్.. వన్డేల్లో దారుణంగా ప్రదర్శనను పునరావృతం చేస్తుంది. విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య కాంట్రాక్టు విభేదాలు వారి ఆటను పక్కదారి పట్టించాయి. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించలేని స్థితికి తీసుకొచ్చాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు