ఇంగ్లండ్‌ దెబ్బకు విండీస్‌ విలవిల

14 Jun, 2019 18:40 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో తడబడింది. ఇంగ్లండ్‌ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన వెస్టిండీస్‌ 44.4 ఓవర్లలో 212 పరుగులకే  చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ పేసర్లు మార్క్‌వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌లు తమ పదునైన బౌలింగ్‌తో విండీస్‌కు వణుకు పుట్టించారు. విండీస్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(63) హాఫ్‌ సెంచరీతో మెరవగా, క్రిస్‌ గేల్‌(36), హెట్‌మెయిర్‌(39)లు ఫర్వాలేదనిపించారు.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆదిలోనే ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(2) వికెట్‌ను కోల్పోయింది. కాగా, గేల్‌-హోప్‌ల జోడి మరో యాభై పరుగులు జత చేశారు.

అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా గేల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో పరుగు వ్యవధిలో షాయ్‌ హోప్‌(11) ఔట్‌ అయ్యాడు.  ఆ తరుణంలో పూరన్‌-హెట్‌మెయిర్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ కుదరుగా బ్యాటింగ్‌ చేస్తూ విండీస్‌ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పూరన్‌ అర్థ శతకం సాధించాడు. ఈ జోడి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్సిన తర్వాత హెట్‌మెయిర్‌ పెవిలియన్‌ చేరగా, కాసేపటికి హోల్డర్‌(9) కూడా ఔటయ్యాడు. ఆ సమయంలో పూరన్‌కు ఆండ్రీ రసెల్‌ జత కలిశాడు. వచ్చీ రావడంతోనే బ్యాట్‌ ఝుళిపించే యత్నం చేసిన రసెల్‌(21) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రసెల్‌ ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత విండీస్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఎవ్వరూ ప‍్రతిఘటించకపోవడంతో ఆ జట్టు 213 పరుగుల సాధారణ టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, జో రూట్‌ రెండు వికెట్లు తీశాడు. క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌లకు చెరో వికెట్‌ లభించింది.


 

మరిన్ని వార్తలు