అఫ్గాన్‌ లక్ష్యం 312

4 Jul, 2019 18:43 IST|Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 312 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. విండీస్‌ ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(58; 78 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మెయిర్‌(39; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌), హోల్డర్‌(45; 34 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌(7) నిరాశపరచడంతో విండీస్‌ 21 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో లూయిస్‌-హోప్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది.

ఈ జోడి రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత లూయిస్‌ రెండో​ వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై హెట్‌మెయిర్‌తో కలిసి 65 పరుగులు జత చేశాడు హోప్‌. దాంతో విండీస్‌ గాడిలో పడింది. చివర్లో పూరన్‌, హోల్డర్‌లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాత్‌వైట్‌ నాలుగు బంతులు ఆడి ఒక సిక్స్‌, రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లలో దవ్లాత్‌ జద్రాన్‌ రెండు వికెట్లు సాధించగా, నబీ, రషీద్‌ ఖాన్‌, షిర్‌జాద్‌లకు తలో వికెట్‌ దక్కింది.


 

మరిన్ని వార్తలు