హెట్‌మెయిర్‌ హిట్టింగ్‌.. భారత్‌కు భారీ లక్ష్యం

21 Oct, 2018 17:30 IST|Sakshi

వెస్టిండీస్‌ స్కోర్‌ 322/8

శతకంతో చెలరేగిన హెట్‌మెయిర్‌

హాఫ్‌ సెంచరీతో రాణించిన కీరన్‌ పావెల్‌

గువాహటి: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ చెలరేగారు. హెట్‌మెయిర్‌ (106: 74బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కీరన్‌ పావెల్‌ (51), హోప్‌ (32), హోల్డర్‌ (38)లు రాణించడంతో
భారత్‌కు 323 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. భారత బౌలర్లలో చహల్‌కు మూడు, షమీ, జడేజాలకు రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు. 10 ఓవర్లు వేసిన షమీ దారుణంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు.

కీరన్‌ శుభారంభం..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత పేసర్‌ షమీ ఓపెనర్‌ హెమరాజ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఆదిలోనే షాకిచ్చినా.. క్రీజులోకి వచ్చిన హోప్‌తో కీరన్‌ పావెల్ దాటిగా ఆడాడు. దీంతో విండీస్‌ 10 ఓవర్లకు వికెట్‌ నష్టపోయి 59 పరుగులు చేసింది.  ఈ క్రమంలో కీరన్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ప్రమాదకరంగా మారిన కీరన్‌ను యువ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షమీ హోప్‌ను.. చహల్‌ సామ్యుల్‌ను ఔట్‌ చేయడంతో విండీస్‌ 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

హెట్‌మెయిర్‌ హిట్టింగ్‌..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్‌, రోవ్‌మన్‌ పావెల్ విండీస్‌ను ఆదుకున్నారు. హెట్‌మెయిర్‌ దాటిగా ఆడుతూ.. స్కోర్‌బోర్డును పరుగెత్తించగా రోవ్‌మెన్‌ ఆచితూచి ఆడుతూ అండగా నిలిచాడు. ఈ దశలో రోవ్‌మన్‌ పావెల్‌(22)ను జడేజా బౌల్డ్‌ చేసి పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హోల్డర్‌ ఆచితూచి ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా హెట్‌మెయిర్‌ మాత్రం తన హిట్టింగ్‌ను ఆపలేదు. ఈ క్రమంలో 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించాడు. దాటిగా ఆడుతున్న హెట్‌మెయిర్‌(106)ను జడేజా పెవిలియన్‌ చేర్చాడు. హోల్డర్‌ (38)కు తోడుగా చివర్లో బిషూ(22), రోచ్‌ (26)లు దాటిగా ఆడటంతో విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు