ట్రిపుల్ సెంచరీ.. మా పొరపాటు వల్లే!

19 Oct, 2016 17:27 IST|Sakshi
ట్రిపుల్ సెంచరీ.. మా పొరపాటు వల్లే!

దుబాయ్: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ (469 బంతుల్లో 302 నాటౌట్; 23 ఫోర్లు, 2 సిక్సర్లు) తో ప్రత్యర్థి వెస్టిండీస్ పై చారిత్రక టెస్టులో పాక్ నెగ్గింది. అయితే తమ జట్టు వైఫల్యం వల్లే తొలి టెస్టులో ఓటమి పాలయ్యామని విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. ఎక్కువ మోతాదులో ఎక్స్ ట్రాలు ఇవ్వడంతో పాటు ట్రిపుల్ వీరుడు అజహర్ ఇచ్చిన క్యాచ్ లను జారవిడచిన కారణంగానే అతడు ఈ ఘనత సాధించాడని పేర్కొన్నాడు. అజహర్ మంచి ఇన్నింగ్స్ ఆడి ఉండొచ్చు కానీ అందుకు అవకాశం కల్పించింది తమ ఆటగాళ్లేనని అభిప్రాయపడ్డాడు.

అక్టోబర్ 17న ఆ టెస్టు చివరి రోజున తమ ఆటగాడు డారెన్ బ్రేవో పోరాటం చేసినా, సహచరుల నుంచి సహకారం లేకపోవడం వల్ల ఓటమి తప్పలేదన్నాడు. తొలుత అజహర్ వ్యక్తిగత స్కోరు 17 వద్ద లియాన్ జాన్సన్, ఆపై డబుల్ చేరువలో 190 రన్స్ వద్ద బ్లాక్ వుడ్ క్యాచ్ లను జారవిడచడంతో భారీ మూల్యం చెల్లించుకోలవాల్సి వచ్చిందన్నాడు. ఫీల్డింగ్ లో విండీస్ ఎంతో మెరుగవ్వాలని లేనిపక్షంలో ఫలితాలు ఇలాగే ఉంటాయని.. బౌలర్లు లయను అందిపుచ్చుకోవాలని జట్టుకు కెప్టెన్ హోల్డర్ సూచించాడు. తమ బౌలర్ గాబ్రియెల్ 11 నోబాల్స్ వేయడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. శుక్రవారం అబుదాబిలో రెండో టెస్టు ప్రారంభంకానుంది.

మరిన్ని వార్తలు