విండీస్‌ 45 ఆలౌట్‌ 

10 Mar, 2019 00:11 IST|Sakshi

 రెండో టి20లో ఇంగ్లండ్‌దే గెలుపు

బాసెటెరీ: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ నెగ్గి... వన్డే సిరీస్‌ను పంచుకున్న వెస్టిండీస్‌... తమకు మంచి పట్టున్న టి20 ఫార్మాట్‌లో మాత్రం సిరీస్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ (4/6) విజృంభించడంతో రెండో టి20లో వెస్టిండీస్‌ చెత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 45 పరుగులకే ఆలౌటై అంతర్జాతీయ టి20 చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్‌ (2014లో శ్రీలంకపై) 39 పరుగులతో ఈ జాబితాలో ముందుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 137 పరుగులతో నెగ్గి సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. జట్టు 32/4తో కష్టాల్లో నిలిచిన దశలో జో రూట్‌ (40 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

అనంతరం స్యామ్‌ బిల్లింగ్స్‌ (47 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోరు అందిం చాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో అలెన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ను జోర్డాన్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. జోర్డాన్‌తో పాటు డానియల్‌ విల్లీ (2/18), రషీద్‌ (2/12), ప్లంకెట్‌ (2/8) కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆతిథ్య జట్టు 11.5 ఓవర్లలో 45 పరుగులకే కుప్పకూలింది. హెట్‌మైర్‌ (10), బ్రాత్‌వైట్‌ (10) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 నేడు జరుగుతుంది.       

మరిన్ని వార్తలు