గేల్‌ మళ్లీ ‘సిక్సర’ పిడుగులా...

4 Mar, 2019 01:06 IST|Sakshi

12.1 ఓవర్లలోనే 114 పరుగుల లక్ష్య ఛేదన

ఆఖరి వన్డేలో విండీస్‌ అలవోక విజయం

ఇంగ్లండ్‌తో సిరీస్‌ సమం

సెయింట్‌ లూసియా: వన్డే సిరీస్‌లో ఆఖరి దెబ్బతో వెస్టిండీస్‌ ఆదరగొట్టింది. బౌలింగ్‌లో ఒషాన్‌ థామస్‌ (5/21) ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కూల్చేస్తే... వెటరన్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (27 బంతుల్లోనే 77; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మళ్లీ చెలరేగాడు. దీంతో ఐదో వన్డేలో మరో 37.5 ఓవర్లు మిగిలుండగానే విండీస్‌ 7 వికెట్ల తేడాతో ఆలవోక విజయం సాధించింది. ఈ సిరీస్‌ ఆసాంతం సిక్సర్ల సునామీ సృష్టించిన గేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ లభించింది. అతను నాలుగే మ్యాచ్‌ల్లో (మూడోది రద్దయింది) 424 పరుగులు చేయడం విశేషం. 39 సిక్సర్లు బాదిన ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 106 సగటు నమోదు చేయడం మరో విశేషం. క్రికెట్‌ చిత్రమంటే ఇదేనేమో! నాలుగు రోజుల క్రితమే ఇంగ్లండ్‌ 418 పరుగుల (నాలుగో వన్డేలో) భారీస్కోరు చేసింది. శనివారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం 28.1 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.

కేవలం 9వ వన్డే ఆడుతున్న 22 ఏళ్ల పేసర్‌ ఒషాన్‌ థామస్‌ ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీశాడు. క్రీజులో నిలబడనీయకుండా, ఖాతా తెరవకుండా తన పేస్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కూల్చేశాడు. అతని ధాటికి స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ మోర్గాన్‌ (18), బట్లర్‌ (23), మొయిన్‌ అలీ (12) నిలువలేదు. టెయిలెండర్లు వోక్స్‌ (0), కరన్‌ (0) పరుగైనా చేయలేకపోయారు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనను గేల్‌ వాయు వేగంతో çపూర్తిచేశాడు. విండీస్‌ 12.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. 8వ ఓవర్లో జట్టు స్కోరు 93 పరుగుల వద్ద గేల్‌ నిష్క్రమించాడు. ఇందులో గేల్‌ చేసినవే 77 పరుగులు. మిగతా లాంఛనాన్ని బ్రేవో (7 నాటౌట్‌), హెట్‌మైర్‌ (11 నాటౌట్‌) పూర్తి చేశారు. ఐదు వన్డేల సిరీస్‌ 2–2తో సమమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం గ్రాస్‌ ఐలెట్‌లో జరుగుతుంది.

మరిన్ని వార్తలు