రెండో వన్డేలో భారత్ ఓటమి

25 Nov, 2013 00:46 IST|Sakshi
రెండో వన్డేలో భారత్ ఓటమి

విశాఖపట్నంలోని స్టేడియానికి, కరీబియన్ దీవుల్లోని సెయింట్ లూసియా అనే చిన్న దేశంలో ఉన్న స్టేడియానికి చాలా పోలికలు ఉంటాయి. మైదానంలో నిలుచుంటే రెండు చోట్లా ఒకే రకమైన కొండలు, వాతావరణం కనిపిస్తుంది. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీది సెయింట్ లూసియానే. వైజాగ్ స్టేడియాన్ని చూసి తన హోమ్ గ్రౌండ్ అనుకున్నాడేమో..! చెలరేగిపోయాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడి... మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ ఆశలు సజీవంగా నిలబెట్టాడు.
 
 విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పొలార్డ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల... ఈ సిరీస్‌లో డారెన్ స్యామీ వెస్టిండీస్ జట్టులో ఉన్నాడు. ఇటీవల తన ఫామ్ అంత ఘోరంగా ఉంది. కానీ అదే స్యామి... తనకు లభించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. విశాఖ నగరంలో ఒక్క ఓటమి కూడా ఎరగని భారత్‌కు షాకిచ్చాడు. భారత పర్యటనలో వరుస ఓటముల నుంచి విండీస్‌ను ఒడ్డున పడేశాడు. స్యామీ (45 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో... ఆదివారం వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది.
 
 
 ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. సెంచరీ చేజారినా...విరాట్ కోహ్లి (100 బంతుల్లో 99; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో పాటు కెప్టెన్ ధోని (40 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు భారత స్కోరులో కీలక పాత్ర పోషించాయి. వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసినెగ్గింది. స్యామీతో పాటు విండీస్ తరఫున మరో ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు చేశారు. పావెల్ (70 బంతుల్లో 59;7 ఫోర్లు, 1 సిక్స్), డారెన్ బ్రేవో (54 బంతుల్లో 50; 8 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యంతో నిలబెడితే...ఆ తర్వాత స్యామీ, సిమన్స్ (74 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.  మూడో వన్డే బుధవారం కాన్పూర్‌లో జరుగుతుంది. స్యామీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 
 కోహ్లి నిలకడ...
 టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... వికెట్‌పై బౌన్స్‌ను రామ్‌పాల్ చక్కగా ఉపయోగించుకున్నాడు.  గత ఐదు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో వరుసగా మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో కనిపించిన రోహిత్ శర్మ (12) జోరుకు రామ్‌పాల్ బ్రేక్ వేశాడు. ధావన్ (37 బంతుల్లో 35; 5 ఫోర్లు) కొద్దిగా దూకుడు ప్రదర్శిస్తూ చక్కటి షాట్లతో అలరించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరోవైపు కోహ్లి మాత్రం తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌పైనే దృష్టి పెడుతూ సాగాడు. కోహ్లితో జత కలిసిన యువరాజ్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) చాలా జాగ్రత్తగా ఆడాడు.
 
 
  విశాఖలో తన రికార్డును కొనసాగిస్తూ కోహ్లి  59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 69 పరుగుల భాగస్వామ్యం అనంతరం స్యామీ బౌలింగ్‌లో యువీ నిష్ర్కమించాడు. కోహ్లితో కొద్ది సేపు ఇన్నింగ్స్‌ను నడిపించిన రైనా (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాలేదు. రెండో పవర్‌ప్లేలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. నరైన్ 41, 45 ఓవర్లను మెయిడిన్‌గా వేశాడు. అయితే చివర్లో ధోని మెరుపులతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 62 పరుగులు చేసింది.   
 
 కీలక భాగస్వామ్యాలు...
 భువనేశ్వర్ మరో సారి తన తొలి స్పెల్‌లో భారత్‌కు శుభారంభం అందించాడు. తన మూడో ఓవర్లో చక్కటి  క్యాచ్‌తో చార్లెస్ (12)ను అవుట్ చేశాడు. ఆ వెంటనే  శామ్యూల్స్ (8) వెనుదిరిగాడు. అయితే ఈ దశలో పావెల్, డారెన్ బ్రేవో కలిసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు.

 భువీ బౌలింగ్‌లో పావెల్ వరుసగా 3 ఫోర్లు కొట్టగా...మోహిత్ బౌలింగ్‌లో బ్రేవో అదే పని చేశాడు. ఈ దశలో నాలుగు బంతుల వ్యవధిలో బ్రేవో ఇచ్చిన మూడు క్యాచ్‌లు చేజారడంతో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అశ్విన్ ఈ తప్పును సరి దిద్దాడు. బ్రేవోను అవుట్ చేసి 100 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించిన అతను...పావెల్‌ను కూడా అవుట్ చేశాడు. కొద్ది సేపటికే డ్వేన్ బ్రేవో (18)ని భువీ అవుట్ చేశాడు. ఈ దశలో సిమన్స్, స్యామీ కలిసి 12.3 ఓవర్లలోనే 82 పరుగులు జోడించారు. ఆఖర్లో కొద్దిగా తడబడినా...స్యామీ గట్టెక్కించాడు.

 స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్యామీ (బి) రామ్‌పాల్ 12; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) పెర్మాల్ 35; కోహ్లి (సి) హోల్డర్ (బి) రామ్‌పాల్ 99; యువరాజ్ (సి) శామ్యూల్స్ (బి) స్యామీ 28; రైనా (సి) డ్వేన్ బ్రేవో (బి) రామ్‌పాల్ 23; ధోని (నాటౌట్) 51; జడేజా (బి) రామ్‌పాల్ 10; అశ్విన్ (సి) చార్లెస్ (బి) హోల్డర్ 19; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 1, వైడ్లు 9) 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 288.  
 
 వికెట్ల పతనం: 1-21; 2-69; 3-138; 4-203; 5-209; 6-240; 7-287.
 బౌలింగ్: రామ్‌పాల్ 10-0-60-4; హోల్డర్ 10-0-63-1; డ్వేన్‌బ్రేవో 8-0-54-0; పెర్మాల్ 10-0-55-1; నరైన్ 10-2-39-0; స్యామీ 1-0-11-1; సిమన్స్ 1-0-5-0.
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 12; పావెల్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 59; శామ్యూల్స్ (సి) ధోని (బి) మోహిత్ శర్మ 8; డారెన్ బ్రేవో (సి)ధోని (బి)అశ్విన్ 50; సిమన్స్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 62; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 18; స్యామీ (నాటౌట్) 63; హోల్డర్ (సి)ధోని (బి) షమీ 7; నరైన్ (సి) సబ్ రాయుడు (బి) షమీ 0; పెర్మాల్ (నాటౌట్ ) 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 7, వైడ్లు 3) 10; మొత్తం (49.3 ఓవర్లలో 8 వికెట్లకు) 289.
 వికెట్ల పతనం:  1-14; 2-23; 3-123; 4-147; 5-185; 6-267; 7-285; 8-285.
 బౌలింగ్:  భువనేశ్వర్ 9-1-56-2; మోహిత్ 6.3-0-48-1; షమీ 7-0-55-2; అశ్విన్ 10-1-37-2; రైనా 7-0-42-0; జడేజా 10-1-44-1.
 
 మంచు కూడా ముంచింది...
 వర్షం  కారణంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా అని భయపడితే... వరుణుడు కరుణించాడు. కానీ అనూహ్యంగా మంచు భారత జట్టును ముంచింది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో తీవ్రంగా మంచు కురవడం వల్ల భారత బౌలర్లు, ఫీల్డర్లు బాగా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఏ మాత్రం పట్టు చిక్కలేదు. ఎన్నో బంతులు అదుపులో లేకుండా చేయి దాటాయి, నియంత్రణ లేకుండా ఫుల్ టాస్‌లుగా మారాయి. మంచు కారణంగా క్యాచ్‌లు కూడా జారాయి.
 
 ధోని కెప్టెన్సీ రికార్డు
 150 వన్డేల్లో జట్టుకు సారథ్యం వహించిన తొలి కీపర్‌గా ధోని రికార్డు సృష్టించాడు.  అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో భారతీయుడిగా అజహర్ (174) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
 
 మంచు ప్రభావం ఉన్న మ్యాచ్‌ల్లో టాస్ గెలవడం చాలా ముఖ్యం. క్లిష్ట పరిస్థితుల్లోనూ మా బౌలర్లు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకురాగలిగారు.    
 - ధోని
 
 వరుసగా విఫలమవుతున్నప్పటికీ నాకు మరో అవకాశం ఇచ్చిన జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. సిమ్మన్స్, నేను మంచి సమన్వయంతో ఆడగలిగాం. చివరి 10 ఓవర్లలో 90కి పైగా పరుగులు సాధించాలనుకున్నాం. కీలక మ్యాచ్‌లో మెరుగ్గా రాణించినందుకు ఆనందంగా ఉంది.     
 - స్యామీ
 

>
మరిన్ని వార్తలు