బంతి తగిలితేనే మరణించాడా?

27 Nov, 2014 17:29 IST|Sakshi
బంతి తగిలితేనే మరణించాడా?

ఫిల్ హ్యూగ్స్ మరణంతో క్రికెట్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. కానీ, కేవలం చిన్న బంతి తగిలితేనే ప్రాణాలు పోతాయా అని చాలామందికి అనుమానం వచ్చింది. అసలే ఏం జరిగిందోనన్న ఆత్రుత, ఆసక్తి చాలామందిలో కనిపించాయి. మరి హ్యూగ్స్ మరణానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దామా..

నవంబర్ 25వ తేదీన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆడుతుండగా హ్యూగ్స్ తలకు ఓ బౌన్సర్ వచ్చి తగిలింది. వెంటనే రెండు క్షణాల్లోనే పడిపోయిన హ్యూగ్స్ మరి లేవలేదు. అటునుంచి అటే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

మెడకు ఒక పక్క ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి వచ్చి బలంగా తగలడం వల్ల అది బాగా నలిగిపోయిందని వైద్యులు తెలిపారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఇది చాలా కీలకం. అయితే అది నలిగిపోవడం వల్ల మెదడులోకి రక్తసరఫరా సరిగా జరగలేదు. ఇది అత్యంత ప్రమాదకరం. దీన్ని వైద్యపరిభాషలో వెర్టెబ్రల్ ఆర్టెరీ డిసెక్షన్ అంటారు. ఈ తరహా ప్రమాదం అత్యంత అరుదైనదని, ఎప్పుడో గానీ  జరగదని హ్యూగ్స్కు చికిత్స చేసిన సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మెదడు చుట్టూ ఉండే పుర్రెలో కొంత భాగాన్ని తొలగించి మెదడుకు రక్తసరఫరా పెంచేందుకు ప్రయత్నించారు. తర్వాత మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి హ్యూగ్స్ను బలవంతంగా కోమాలోకి పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో.. హ్యూగ్స్ ప్రాణాలు వదిలాడు.

మరిన్ని వార్తలు