‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’

25 Feb, 2020 12:26 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

వెల్లింగ్టన్‌: గత నాలుగేళ్లలో టీమిండియా పేస్‌ దళం పూర్తిగా మారిపోయింది. దేశవిదేశాల్లో రాణిస్తూ.. టీమిండియా సాధించిన అపూర్వ విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తూ.. వికెట్లు పడగొడుతూ.. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ సహచర బౌలర్లకు మార్గ నిర్దేశం చేస్తున్నాడు జస్ప్రిత్‌ బుమ్రా. జనవరి, 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా తిరిగి వెనక్కి చూసుకోలేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే పది ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. ముఖ్యంగా స్లాగ్‌ ఓవర్లలో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసి ఔరా అనిపించాడు. అయితే ఆనాటి మ్యాచ్‌ గురుతులను అభిమానులతో బుమ్రా తాజాగా పంచుకున్నాడు. 

‘అరంగేట్రపు మ్యాచ్‌ ప్రతీ ఒక్క క్రికెటర్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు. అయితే తొలి మ్యాచ్‌లో ఆ క్రికెటర్‌పై అందరిలోనూ ఎన్నో ఆశలు అంతకుమించి ఎన్నో అంచనాలు ఉంటాయి. దీంతో ఆ అరంగేట్ర ఆటగాడిపై అధిక ఒత్తిడి ఉంటుంది.  రాణిస్తే ఫర్వాలేదు.. లేదంటే జట్టులో స్థానమే పోతుంది. ఇలాంటి ఆలోచనలు అరంగేట్రపు మ్యాచ్‌లో నా మదిలో కూడా మెదిలాయి. మ్యాచ్‌లో తొలి బంతి వేయడానికి ముందు ఎవరూ నాదగ్గరికి రాలేదు.. ఏం చెప్పలేదు. కానీ ఎంఎస్‌ ధోని మాత్రం నేను బౌలింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చి నీకు నువ్వులా ఉండు. నీ ఆటను నువ్వు ఎంజాయ్‌ చేయ్‌, ఆస్వాదించు’ అంటూ ధోని తనలో ధైర్యం నింపాడని బుమ్రా తెలిపాడు. ఇక వెన్నుగాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమైన బుమ్రా రీఎంట్రీలో పేలవ ఫామ్‌తో నిరుత్సాహపరుస్తున్నాడు. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

చదవండి:
‘ఆ విషయంలో ఆమెకు ఫుల్‌ లైసెన్స్‌’
ట్రంప్‌ను ట్రోల్‌ చేసిన పీటర్సన్‌, ఐసీసీ
ముష్ఫికర్‌ ‘డబుల్‌’ చరిత్ర​​​​​​​
​​​​​​​

మరిన్ని వార్తలు