సబా కరీమ్‌కు ఇంగ్లండ్‌లో ఏం పని? 

10 Jul, 2018 00:57 IST|Sakshi

 బీసీసీఐ కోశాధికారి ప్రశ్న 

ముంబై: గత కొంత కాలంగా బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య కొనసాగుతున్న పరస్పర విమర్శల దాడుల్లో మరో అంకం ఇది. బోర్డు సభ్యుల పర్యటనలు, ఖర్చులను తరచుగా ప్రశ్నిస్తున్న సీఓఏని దోషిగా నిలబెట్టే విధంగా కోశాధికారి అనిరుధ్‌ చౌదరి కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుతో పాటు బోర్డు జనరల్‌ మేనేజర్‌ సబా కరీమ్‌ కూడా అక్కడకు వెళ్లారు. ఆయనకు రోజూవారీ భత్యం (డీఏ) మంజూరు చేయాలంటూ వచ్చిన లేఖపై అనిరుధ్‌ స్పందించారు. ‘9 రోజుల పాటు కరీమ్‌ ఇంగ్లండ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ముందుగా చెప్పండి. దానికి తగిన ఆధారాలు కూడా జత చేయండి.

ప్రస్తుతానికి నేను కరీమ్‌ డీఏ బిల్లులపై సంతకమైతే పెడుతున్నా కానీ ఆయన పర్యటన గురించి వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నా’ అని సీఓఏకు అనిరుధ్‌ లేఖ రాశారు. సబా కరీమ్‌ తొమ్మిది రోజులకు కలిపి హోటల్‌ అద్దె కాకుండా డీఏ కింద 4,050 యూఎస్‌ డాలర్లు (సుమారు రూ. 2 లక్షల 78 వేలు) తనకు ఇవ్వాలంటూ బిల్‌ సమర్పించారు. నిబంధనల ప్రకారం రోజుకు రూ. 30 వేల డీఏ బోర్డు అధికారులకు లభిస్తుంది. కొన్నాళ్ల క్రితం తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి 3 టి20 మ్యాచ్‌లు చూసేందుకు ఇంగ్లండ్‌ వెళ్లాలని భావించగా... ఆయన వెళ్లడం వల్ల బీసీసీఐకి ఎలాంటి అదనపు ప్రయోజనం లేదంటూ సీఓఏ దానిని అడ్డుకుంది. సరిగ్గా ఇప్పుడు అదే తరహా అంశంలో సీఓఏ చూపించిన ద్వంద్వ ప్రమాణాలు బయట పడ్డాయి.    

>
మరిన్ని వార్తలు