క్రికెటర్ పై వెల్లువెత్తిన సెక్స్ ఆరోపణలు

7 Jan, 2016 01:26 IST|Sakshi
క్రికెటర్ పై వెల్లువెత్తిన సెక్స్ ఆరోపణలు

 వెల్లువెత్తిన సెక్స్ ఆరోపణలు  
 వివాదంలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్
 బీబీఎల్‌నుంచి గేల్ అవుట్!

 మహిళా జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూ వివాదాన్ని గేల్ ‘సారీ’తో ముగించాలని ప్రయత్నించినా... ఇది అంత తొందరగా సద్దుమణిగేలా లేదు. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న బిగ్ బాష్  లీగ్ నిర్వాహకులు గేల్‌ను పూర్తిగా లీగ్‌నుంచే బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే గేల్‌కు జరిమానా విధించిన అతని జట్టు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మున్ముందు పూర్తిగా గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వచ్చే ఏడాది ఏ జట్టు తరఫున కూడా గేల్‌ను కొనసాగించరాదని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం.  
 
 సిడ్నీ: క్రిస్ గేల్ అంటే పరుగుల సునామీ సృష్టించే విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు...మంచి ‘కళా పోషకుడు’ కూడా అని అతని ఫోటోలు, సోషల్ నెట్‌వర్క్‌లో వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఎన్నో సార్లు కొత్త కొత్త అమ్మాయిలతో సరదాగా గడుపుతూ గేల్ చిత్రాలు పోస్ట్ చేశాడు. మైదానం బయట తన వ్యక్తిగత జీవితాన్ని అతను ఎప్పుడూ దాచుకోలేదు. అయితే ఇప్పుడు ఇది కాస్తా శృతి మించి విషయం బహిరంగ వేదికపై వచ్చే సరికి అతని లీలలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. సోమవారం ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌తో అభ్యంతరకర సంభాషణ వెలుగులోకి వచ్చిన తర్వాత గతంలో గేల్‌తో ఇబ్బంది పడిన మరి కొందరు మహిళా జర్నలిస్ట్‌లు ముందుకు వచ్చి అతని ప్రవర్తన గురించి గుట్టు విప్పుతున్నారు. ‘గేల్ ఇలా వ్యవహరించడం ఇది మొదటి సారి కాదు.
 
 అతను చాలా సార్లు ఇదే పని చేశాడు. అతనో దుర్మార్గుడు’ అని ఫాక్స్ స్పోర్ట్స్ రిపోర్టర్ నెరోలి మెడోస్ వెల్లడించింది. 2011లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ‘నీ అందాన్ని చూస్తూ ప్రశ్న వినలేకపోయాను’ అని గేల్ వ్యాఖ్యానించాడని ఆమె చెప్పింది. ‘ట్విట్టర్ ద్వారా నన్ను ఒకసారి డిన్నర్‌కు రమ్మన్న గేల్, ఇంటర్వ్యూ తర్వాత డేటింగ్‌కు వెళదామని కోరాడు. అతడికి ఆడవాళ్లంటే పిచ్చి’ అని నైన్ న్యూస్ రిపోర్టర్ వోని సాంప్సన్ ఆరోపించింది. మరో వైపు ప్రపంచ కప్ సందర్భంగా ఒక మహిళతో డ్రెస్సింగ్ రూమ్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలను గేల్ ఖండించాడు. ‘అదంతా పూర్తిగా అబద్ధం. మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారం.
 
  ఇకపై ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్య తీసుకుంటాం’ అని గేల్ తరఫున అతని ఏజెంట్ ప్రకటన జారీ చేశారు. తాజా ఆరోపణలను గేల్ బిగ్‌బాష్ జట్టు మెల్‌బోర్న్ సీఈ స్టువర్ట్ కోవెంట్రీ ‘అవకాశవాదం’గా కొట్టిపారేశారు. సిడ్నీ ఘటనకు సంబంధించి విక్టోరియా క్రికెట్ సంఘం విచారణ తర్వాతే తాను ఈ వ్యాఖ్య చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అటు తన స్వదేశంలో జమైకాలోనూ గతంలో ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా మాట్లాడాడని గేల్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం ప్రతి ఏడాది భారత్‌లో రెండు నెలల పాటు ఉండే గేల్... ఇప్పటివరకైతే వివాదాల్లో లేడు. అయితే వరుసగా కొత్తకొత్త మహిళలు బయటకు వస్తున్న నేపథ్యంలో... భారత్‌లోనూ ఎవరైనా బయటకు వచ్చి గేల్ గురించి చెబితే... తను మరిన్ని సమస్యల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
 

మరిన్ని వార్తలు