బీసీసీఐ లేకుండా ఐసీసీనా?

24 Oct, 2019 15:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కొత​ కార్యవర్గం ఇలా కొలువు దీరిందో లేదో అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ని టార్గెట్‌ చేసింది. ఇటీవల సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా నియామకం ఖరారైన సందర్భంలో మాట్లాడుతూ తమకు రావాల్సిన వాటాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోమంటూ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఐసీసీ నుంచి తమ వాటా పూర్తిస్థాయిలో రావడం లేదంటూ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కోశాధికారి అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌.. తమకు ఐసీసీలో తగిన ప్రాధన్యత ఇచ్చి తీరాలన్నాడు. తమ వాటా విషయంలో కచ్చితమైన నిర్ణయంతో ముందుకు సాగుతామన్నారు.

‘ఐసీసీ రోడ్‌ మ్యాప్‌లో బీసీసీఐ లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు బీసీసీఐ లేకుండా ఐసీసీనా. బీసీసీఐ లేకుండా ఐసీసీ ఏమి చేస్తుంది’ అని ప్రశ్నించారు. ఐసీసీ కొత్త ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌లో భారత్‌ నుంచి తమ వాదనను వినిపించడానికి ప్రతినిధులు ఎవరూ లేకపోవడంపై ధుమాల్‌ స్పందించారు. తాము లేకుండా ఐసీసీ ఉంటుందా అంటూ చమత్కరించారు. భవిష్యత్తు టోర్నీలో పొడిగించాలనే ఐసీసీ కొత్త ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదన్నారు. ఎఫ్‌టీపీ(ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రొగ్రామ్‌)ను డిజైన్‌ చేసుకునే క్రమంలో బీసీసీఐ  ఏమీ ఐసీసీ బోర్డులో లేదన్నారు. ఇక్కడ బీసీసీఐ అనేది ఒక సెపరేటు బోర్డు అనే విషయాన్ని ధుమాల్‌ గుర్తు చేశారు. తమ లక్ష్యం బీసీసీఐ ఆదాయాన్ని పెంచడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కొంతకాలం క్రితం వరకు బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ నుంచి భారీ రెవెన్యూను దక్కించుకునేది. అయితే రెండేళ్ల క్రితం బిగ్‌ త్రీ మోడల్‌ ప్రకారం​ నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో భారత క్రికెట్‌ బోర్డు ఆదాయంలో భారీ కోత పడింది. 2016 నుంచి 2023 వరకూ ఉండే ఎనిమిదేళ్ల పరిధిలో 293 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకోనుంది. అయితే తమ వాటా ప్రకారం తమ రావాల్సింది రెట్టింపు అంటూ గంగూలీ ఇప్పటికే ఐసీసీకి సంకేతాలు పంపాడు.

మరిన్ని వార్తలు