ధోనీ రిటైర్మెంట్కు కారణమదేనా?

30 Dec, 2014 16:33 IST|Sakshi
ధోనీ రిటైర్మెంట్కు కారణమదేనా?

న్యూఢిల్లీ: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తక్షణం రిటైరవడానికి కారణమేంటి? క్రికెట్ వర్గాలు, అభిమానులను వేధిస్తున్న ప్రశ్నఇది. ధోనీ ఇంత తొందరగా రిటైరవుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ధోనీ అనూహ్య నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ధోనీ తన రిటైర్మెంట్ విషయం గురించి రెండేళ్ల కిందటే ప్రస్తావించాడు. వచ్చే ప్రపంచ కప్ (2015 వన్డే కప్) నాటికి తన వయసు 34 ఏళ్లు ఉంటాయని, జట్టుకు సారథ్యం వహించాలంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన అవసరముందని మహీ గతంలో వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్, పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించాలంటే టెస్టుల నుంచి వైదొలగకతప్పదని కూడా అప్పట్లో చెప్పాడు. ధోనీ కెప్టెన్గా భారత్కు అత్యుత్తమ విజయాలు అందిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలివి. మహీ తన సారథ్యంలో టి-20, వన్డే ప్రపంచ కప్లను అందించాడు. ఇక టెస్టుల్లో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా మన్ననలందుకున్నాడు. రెండేళ్ల క్రితం కూడా ధోనీ కెప్టెన్సీ విషయంపై చర్చ జరిగింది. మహీపై ఒత్తిడి తగ్గించేందుకు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని కొందరు విశ్లేషకులు ప్రతిపాదించారు. కనీసం టెస్టు ఫార్మాట్కన్నా వేరేవారికి పగ్గాలు అప్పగించాలని సూచించారు.

తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ధోనీ రిటైర్మెంట్పై ప్రకటన చేయడం షాక్కు గురిచేసింది. కాగా బీసీసీఐ మహీ నిర్ణయాన్ని సమర్థించింది. పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. దీన్నిబట్టి ప్రపంచ కప్, పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకే మహీ రిటైరయ్యాడని భావిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఇటీవల గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చినా అవి కెప్టెన్సీపై ప్రభావితం చూపేంత పెద్దవికావు. విదేశాల్లో పరాజయాలు, గాయాలు, ఒత్తిడి ప్రభావం చూపే అవకాశాలున్నా.. తక్షణం వైదొలిగేంత కారణాలు కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు