మైదానంలో మాటల యుద్ధం

21 Dec, 2018 03:30 IST|Sakshi

అన్ని వేళలా స్టంప్‌ మైక్‌ ఆన్‌

సాంకేతిక పరిజ్ఞానం అతి జోక్యం వ్యక్తిగత సంభాషణలూ బయటకు

 తాజా ఘటనలే నిదర్శనం

మైదానంలో మాటల యుద్ధం ఇప్పుడు మూకీ సినిమానుంచి టాకీ వరకు చేరింది... కొన్నాళ్ల క్రితం వరకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేసుకున్నా పెదాల కదలికతోనే వారేం అనుకున్నారో అభిమానులు ఊహించేసుకునేవారు...కానీ మీకు అంత కష్టమెందుకు మేమున్నామంటూ ప్రసారకర్తలు అర్థ తాత్పర్యాలతో వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. తాజాగా కోహ్లి, పైన్‌ సంభాషణ స్పష్టంగా వినిపించడం కూడా అలాంటిదే. ఇటీవలి వరకు కేవలం మ్యాచ్‌ సాగుతున్న సమయంలో మాత్రమే స్టంప్‌ మైక్‌లు పని చేసేవి. బంతి డెడ్‌ కాగానే, విరామంలో అన్నీ బంద్‌. కానీ తాజా భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి సర్వకాలాల్లో మైక్‌లు పని చేసే విధంగా నిబంధన సవరించడంతో క్రికెటర్లు క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.   

క్రికెట్లోకి టెక్నాలజీ చొచ్చుకొస్తోంది. కాలంతో పాటు ఈ పరిణామం సహజం అనుకున్నా... అది మరీ ‘పిచ్‌’లోకే వచ్చేసింది. దూషణలు, సంభాషణలు, వాదనలు, వివాదాలతో పాటు ఆటగాడి కనీస ప్రతిస్పందనలనూ బయటపెట్టేస్తోంది. చివరకు తమను దెబ్బతీసేందుకు ఓ సాధనంగా వాడుతున్నారంటూ పర్యాటక జట్లు వాపోయేంతగానూ మారుతోంది. ప్రస్తుత ఆస్ట్రేలియా–భారత్‌ టెస్టు సిరీస్‌లో జరుగుతున్న ఘటనలు ఈ కోణంలో మరింత చర్చ రేపుతున్నాయి. ఇప్పటికైతే ఇవి కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ... మున్ముందు విషయం ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి. 

ఈ చెవులు... చాలా పెద్దవి 
కొద్ది రోజుల  క్రితం వరకు మ్యాచ్‌లో ఓవర్‌ మధ్య విరామం సందర్భంగా ‘స్టంప్‌ మైక్‌’లు ఆఫ్‌ అయ్యేవి. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నవంబర్‌ నుంచి తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం స్టంప్‌ మైక్‌లు నిరంతరం ఆన్‌లో ఉంటాయి. అంటే, విరామం సందర్భంలోనూ పిచ్‌ పరిసరాల్లో జరిగే సంభాషణలు రికార్డవుతుంటాయి. ఈ విధంగానే పెర్త్‌ టెస్టులో ఇషాంత్‌–జడేజా వాగ్యుద్ధం, అంతకుముందు పరస్పరం రెచ్చగొట్టుకున్నట్లు సాగిన కోహ్లి–పైన్‌ సంవాదం, ‘కోహ్లిని మీరు కెప్టెన్‌గా చూడొచ్చేమో... అతడు అంత మంచివాడేమీ కాద’ని మురళీ విజయ్‌తో పైన్‌ అన్న మాటలు వెలుగులోకి వచ్చాయి. మామూలుగా అయితే ఎవరైనా చెబితేనే తెలిసే సంగతులివి. కానీ, స్టంప్‌ మైక్‌ ఆన్‌లోనే ఉండటంతో చాలా సులువుగా అందరికీ చేరిపోయాయి. ఇక్కడ మ్యాచ్‌ ప్రసారకర్తల పాత్రనూ తక్కువ చేయలేం. 

ప్రసార‘కక్షదారులు’ 
ఐసీసీ ఏ ఉద్దేశంలో తెచ్చిందోగాని, తాజా నిబంధన క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. ఇదే సమయంలో మ్యాచ్‌ అధీకృత ప్రసార సంస్థలు తమ దేశ జట్లకు ఉపయోగపడేలా లీకులు ఇస్తుండటంతో పర్యాటక జట్లను మానసికంగా దెబ్బకొట్టే ఎత్తుగడగానూ మారింది. ఉదాహరణకు పెర్త్‌ టెస్టులో భారత పేసర్‌ ఇషాంత్‌శర్మ, సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు రవీంద్ర జడేజా మధ్య వాగ్యుద్ధం మ్యాచ్‌ నాలుగో రోజున చోటుచేసుకుంది. వాస్తవంగా అదే రోజు దీనిని బయటపెట్టాలి. కానీ, మ్యాచ్‌ ప్రసారకర్త ‘చానెల్‌ 7’ ఈ ఫీడ్‌ను మరుసటి రోజు విడుదల చేసింది. చిత్రమేమంటే... ఇదే సమయంలో షమీ బౌన్సర్‌ హెల్మెట్‌కు తగిలి ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌కు చుక్కలు కనిపించాయి.

ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇషాంత్‌–జడేజా ఉదంతాన్ని చెప్పడం ద్వారా టీమిండియాలో విభేదాలు ఉన్నాయని చాటాలని చూసింది. వారిద్దరి మధ్య సంభాషణ కూడా ఆ ఫుటేజీలో స్పష్టంగా వినిపించింది. దాంతో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కల్పించుకుని... తమ జట్టులో అంతా బాగుందని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు అడిలైడ్‌ టెస్టులో ఇషాంత్‌పై ఇలాగే గురిపెట్టింది. వరుసగా ‘నోబాల్స్‌’ వేస్తుండటంతో అతడి బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తీక్షణ పరిశీలనకు దిగింది. మొత్తం ఐదు నోబాల్స్‌ వేస్తే మూడింటినే ప్రకటించారంటూ విశ్లేషించింది. తద్వారా మ్యాచ్‌ అధికారులను మించిన పాత్ర పోషించింది. ఇందులో ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేయడంతో పాటు సొంత జట్టును పైమెట్టు ఎక్కించే వ్యూహం దాగుండటం గమనార్హం. ఒకవిధంగా చెప్పాలంటే గూఢచారి పాత్ర అన్నమాట. 

అంతకుముందు... ఆ తర్వాత 
ఇప్పుడంటే ఆస్ట్రేలియాకు లాభం చేకూర్చాలని చూస్తున్నదని చానెల్‌ 7 తీరును చెప్పుకొంటున్నాం గానీ, అసలు ప్రసారకర్తల దృష్టిలో పడి చావుదెబ్బ తిన్నది ఆస్ట్రేలియానే. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్‌ టెస్టులో ఫీల్డ్‌ అంపైర్లు, మూడో అంపైర్‌ సహా ఎవరూ పసిగట్టలేని ఆసీస్‌ ఆటగాళ్ల బాల్‌ ట్యాంపరింగ్‌ను బయటపెట్టింది మ్యాచ్‌ ప్రసారకర్తే. విదేశంలో జరిగింది కాబట్టి అప్పటి ఆస్ట్లేలియా కెప్టెన్‌ స్మిత్, వైస్‌ కెప్టెన్‌ వార్నర్, ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ తప్పించుకోలేనంతగా దొరికిపోయారు. ఈ ఘటన స్వదేశంలో జరిగి ఉంటే, ఆ ఫీడ్‌ను తొక్కిపట్టి ఆసీస్‌ను బయటపడేసే వారే. అంతకుముందు భారత పర్యటనలో తమ వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్, భారత స్పిన్నర్‌ జడేజా మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని బీసీసీఐ కావాలనే కొంత ఆలస్యంగా బయటపెట్టిందని స్మిత్‌ అప్పట్లో విమర్శించడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు