ఐపీఎల్ విజేతకు ఎన్ని కోట్లు?

27 May, 2018 17:27 IST|Sakshi

ముంబై: క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ పండుగ నేటి(ఆదివారం)తో ముగియనుంది. ఐపీఎల్‌ టైటిల్‌ కోసం నగరంలోని వాంఖేడే స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు ఫైనల్‌ పోరులో తలపడనున్నాయి. మరి ఐపీఎల్ విజేతకు ఇచ్చే మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 20 కోట్లు. గెలిచిన జట్టు కెప్టెన్‌కు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.12.5 కోట్ల క్యాష్ ప్రైజ్ అందుతుంది.

అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌కు రూ. 10 లక్షల చెక్‌తోపాటు ట్రోఫీని బహుకరిస్తారు. అదే సమయంలో సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్‌కి కూడా రూ.10 లక్షల ఇవ్వనుండగా, ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బ్యాట్స్‌మన్‌కి రూ.10 లక్షలు అందజేయనున‍్నారు.

ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికైన ఆటగాడికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్టార్‌గా మారే అవకాశం ఉన్న ఆటగాణ్ని ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తారు.

మరొకవైపు ఏడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన క్రీడా మైదానాలకు రూ.50 లక్షల చెక్‌తో పాటు ట్రోఫీని అందజేస్తారు. ఏడు కంటే తక్కువ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన క్రికెట్ స్టేడియంలకు రూ.25 లక్షల నగదు బహుమతితో పాటు ట్రోఫీ బహుకరిస్తారు.

మరిన్ని వార్తలు