రోహిత్‌ చేసేది.. కోహ్లి కూడా చేయలేడు!

9 Nov, 2019 11:59 IST|Sakshi

రాజ్‌కోట్‌: మూడు టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. రెండో టీ20లో అదరగొట్టాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రోహిత్‌ శర్మ ఫుల్‌, కట్‌ షాట్స్‌తో దుమ్మురేపాడు. ముఖ్యంగా మొసాదెక్‌ హుస్సేన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో రోహిత్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది జరిగిన వన్డే  వరల్డ్‌కప్‌లో సైతం రికార్డు స్థాయిలో ఐదు శతకాలు బాదిన రోహిత్‌, ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ బాదేసి పలు రికార్డులు బ్రేక్‌ చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఆట గురించి టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో రోహిత్‌ ఆడే ఆటగాడు లేడంటూ కితాబిచ్చాడు.

‘ఒకే ఓవర్‌లో మూడు లేదా నాలుగు సిక్సర్లు బాదడం ఒక కళ. 45 బంతుల్లో 80 నుంచి 90 పరుగుల మధ్యలో సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అంతెందుకు రోహిత్‌ శర్మ తరహాలో విరాట్ కోహ్లి ఆడటాన్ని నేను ఇప్పటి వరకూ చూడలేదు.  రోహిత్‌ చేసేది.. కోహ్లి కూడా చేయలేడు. గతంలో సచిన్ టెండూల్కర్ మాత్రమే అలా ఆడేవాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఆడుతున్నాడు. రోహిత్ మినహా ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలోనే ఎవరూ అలా ఆడేవారు లేరు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 లో కేవలం 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో రోహిత్‌ 85 పరుగులు చేశాడు. దాంతో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలోనే ఛేదించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా