ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది: రహానే

1 Oct, 2019 11:40 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో రేపట్నుంచి ఇక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో కనీసం ముగ్గురు పేసర్లతో తాము బరిలోకి దిగే అవకాశం ఉందని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే స్పష్టం చేశాడు.  అధిక సంఖ్యలో పేసర్లను తీసుకుంటారా.. లేక స్పిన్నర్లతో పోరుకు సిద్ధమవుతారా అనే దానిపై రహానే దాదాపు స్పష్టతనిచ్చాడు. సఫారీలతో తొలి టెస్టుకు ముగ్గురు పేసర్లను తీసుకొవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఇటీవల వెస్టిండీస్‌ పర్యటలో శతకం సాధించడపై రహానే స్పందించాడు. ‘ ప్రతీ మ్యాచ్‌ నుంచి ప్రతీ సిరీస్‌ నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం.

నేను సెంచరీ కోసం దాదాపు రెండేళ్లు నిరీక్షిస్తాం. 17 టెస్టు మ్యాచ్‌లు ఆగాల్సి వచ్చింది. జట్టు నుంచి చక్కటి సమన్వయం కుదరడంతోనే విండీస్‌ పర్యటనలో నేను సెంచరీ సాధించాను. 17 టెస్టుల్లో వ్యక్తిగత స్కోరు పరంగా ఆకట్టుకున్నప్పటికీ సెంచరీ సాధించలేకపోయాను. కానీ దాని కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. ఒకవేళ సెంచరీ చేస్తామని రాసి ఉంటే అది కచ్చితంగా వస్తుంది. నా శక్తి సామర్థ్యాలను బాగా విశ్వసిస్తాను. టెక్నికల్‌ పరంగా పెద్దగా ఆలోచించను. పరిస్థితుల్ని బట్టి నా గేమ్‌ను ప్లాన్‌ చేసుకుంటా. ప్రధానంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మానసికంగా సన్నద్ధం కావడానికి యత్నిస్తా’ అని రహానే పేర్కొన్నాడు.  మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఉదయం గం.9.30 ని.లకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు