బీసీసీఐని నిలదీసిన క్రికెటర్‌

5 Sep, 2019 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ: తానేమీ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ని ప్రశ్నించడం లేదంటూనే ఉతికి ఆరేశాడు సౌరాష్ట్ర రంజీ క్రికెటర్‌ షెల్డాన్‌ జాక్సన్‌. గత కొన్నేళ్లుగా సౌరాష్ట్ర ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ తమ జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ‘ మీకు మా ఆటగాళ్లు ప్రదర్శన కనబడలేదా.. లేక చిన్న జట్టే కదా అని మాపై చిన్నచూపా. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరాం. కానీ మా జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కనీసం ‘ఏ’ సిరీస్‌లకు మమ్మల్ని ఎంపిక చేయడం లేదు. ఇదేనా మీరు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు ఇచ్చే ప్రాముఖ్యత.

గత ఐదేళ్ల నుంచి చిన్న రాష్ట్రాల జట్లకు ఆడుతున్న వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు.. ఇప్పటికీ మమ్మల్ని అలానే చూస్తున్నారా. ఇప్పటివరకూ సితాన్షు కోటక్స్‌ కోచింగ్‌లో సౌరాష్ట్ర మూడు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మా జట్టులో బ్యాట్‌, బంతితో మెరిసే ఆటగాళ్లు ఉన్నారు. కానీ మాకు దక్కే గౌరవం దక్కడ లేదు. ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కాదు.. కేవల అడుగుతున్నానంతే’ అని వరుస పెట్టి ట్వీట్ల వర్షం కురిపించాడు షెల్డాన్‌ జాక్సన్‌.

సౌరాష్ట్ర తరఫున ప్రతిభ చాటుకుంటున్న క్రికెటర్లలో జాక్సన్‌ ఒకడు. తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సుమారు 50 సగటుతో దూసుకుపోతున్నాడు. స్వతహాగా వికెట్‌  బాట్స్‌మన్‌ అయిన జాక్సన్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌ కూడా ఆడాడు.

మరిన్ని వార్తలు