‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’

9 May, 2020 10:13 IST|Sakshi

ఏమి కావాలన్నా ఇస్తా.. ఆ బ్యాట్‌ వద్దు

లైవ్‌ వీడియో సెషన్‌లో హేడెన్‌

సిడ్నీ: తనకు నచ్చిన ఐపీఎల్‌ ఫేవరెట్‌ మూమెంట్‌ గురించి చెన్నై సూపర్‌ ఇన్నింగ్స్‌(సీఎస్‌కే)ఆటగాడు సురేశ్‌ రైనా ఇటీవల  చెబుతూ.. ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ బ్యాట్‌ నుంచి  2010లో వచ్చిన అద్భుతమైన ఇన్నింగ్సేనని చెప్పాడు. దాదాపు పదేళ్ల  క్రితం అప్పటి  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో హేడెన్‌ 43 బంతుల్లో 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. అదే తన ఫేవరెట్‌ ఐపీఎల్‌ మూమెంట్‌ అని రైనా చెప్పుకొచ్చాడు. 

అయితే ఆ ఇన్నింగ్స్‌ను ఆడిన క్రమంలో మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించాడు హేడెన్‌. పొడవాటి హ్యాండిల్‌తో పాటు ఆ బ్యాట్‌ బ్లేడ్‌ కుదించినట్లు ఉండటమే దీని ప్రత్యేకత. చాలా సందర్భాల్లో మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించి హేడెన్‌ సక్సెస్‌ అయ్యాడు. కాగా, ఆ సమయంలో ఢిల్లీతో చెలరేగిపోయిన ఆ బ్యాట్‌ను ఉపయోగించవద్దన్నాడట సీఎస్‌కే కెప్టెన్‌ ధోని.  ఈ విషయాన్ని తాజాగా హేడెన్‌ స్పష్టం చేశాడు. దీన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో హేడెన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ తర్వాత మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించడానికి ధోని ఒప్పుకోలేదు. ఆ బ్యాట్‌ను  ఎంతమాత్రం ఉపయోగించవద్దన్నాడు. నీ కోసం ఏమైనా ఇస్తాను కానీ దాన్ని మాత్రం వాడద్దని ధోని సూచించాడు.  (నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ మూమెంట్‌ అదే: రైనా)

ఇది రిస్క్‌తో కూడుకున్న అంశం కాబట్టే ధోని అలా చెప్పాడు. నా ఫ్రాంచైజీని కష్టాల్లోకి నెట్టడం ఇష్టంలేక  ధోని సూచనను పాటించా. దాదాపు ఏడాదిన్నర కాలం మంగూస్‌ బ్యాట్‌ను ప్రాక్టీస్‌లో ఉపయోగించా. ఆ బ్యాట్‌ 20 మీటర్లు ముందుకు ఉంటుంది. పొడవైన హ్యాండిల్‌ ఉండటంతో బంతిని ముందుగానే  హిట్‌ చేసే అవకాశం  ఉంటుంది. అలాగే ఈ బ్యాట్‌తో ప్రమాదం కూడా ఎక్కువే. అంచనా తప్పితే ఔట్‌ కాక తప్పదు. ఇదే విషయాన్ని ధోని ఒక్క మాటలో వాడొద్దని చెప్పాడు. నా ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురి చేయకూడదని ఉద్దేశంతో దాన్ని వినియోగించడం ఆపేశా. మంగూస్‌ బ్యాట్‌ను  ఉపయోగించడం కచ్చితంగా సాహసోపేత నిర్ణయమే. నా గేమ్‌ను మెరుగవుతుందనే దీన్ని ఉపయోగించా. ఆ బ్యాట్‌తో ఆడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. మంగూస్‌ బ్యాట్‌తో ఆడటం నాకు చాలా ఇష్టం. ఆ బ్యాట్‌తో ఆడటం సరదాగా ఉంటుంది. ఇంటి దగ్గర మాత్రం మంగూస్‌ బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేసేవాడిని’ అని హేడెన్‌ తెలిపాడు. ఈ వీడియోను సీఎస్‌కే తన అధికారికి ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.(ఆడొచ్చు కానీ... మజా ఉండదు)

మరిన్ని వార్తలు