టీమిండియా ఫస్ట్‌ ర్యాంకు కొట్టాలంటే!

11 Jul, 2018 11:53 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్లు

హైదరాబాద్‌ :  సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి నెం1 స్థానాన్ని సాధించాలంటే వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయాలి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత్‌.. గురువారం ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌లో ఉండగా..123 పాయింట్లతో కోహ్లి సేన రెండో ర్యాంకులో కొనసాగుతోంది. గత మే నెలలో ఇంగ్లండ్‌ భారత్‌ను వెనక్కు నెట్టి తొలి ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ మళ్లీ ఆ ర్యాంకు పొందాలంటే ప్రస్తుత వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌ వాష్‌ చేయాలి. ఇక ఇంగ్లండ్‌ సైతం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 10 పాయింట్లు సాధించాలి. భారత్‌ను వైట్‌వాష్‌ చేస్తేనే సాధ్యమవుతోంది.  

ప్రపంచకప్‌ సన్నాహకల్లో భాగంగా అన్ని జట్లు ఈ ఏడాది బీజీ షెడ్యూల్‌ను గడపనున్నాయి. ఈ సిరీస్‌ల్లోని ఫలితాలతో ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంది. జూలై 17న ఇంగ్లండ్‌-భారత్‌ సిరీస్‌ ముగియనుండగా.. జూలై 13 నుంచి జింబాంబ్వే వేదికగా పాకిస్థాన్‌ 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 నుంచి వెస్టిండీస్‌ మూడు వన్డేలకు బంగ్లాదేశ్‌కు ఆతిథ్యమివ్వనుంది. జూలై 29 నుంచి దక్షిణాఫ్రికా శ్రీలంక వేదికగా 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక నెపాల్‌, నెదార్లండ్‌పై రెండు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జింబాంబ్వేపై పాక్‌ 4-1తో సిరీస్‌ గెలిస్తేనే తన ర్యాంకు నిలబెట్టుకోనుంది. అలాగే దక్షిణాఫ్రికా సైతం తన ర్యాంకు కోల్పోవద్దంటే శ్రీలంకను వైట్‌ వాష్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత ర్యాంకులు
1. ఇంగ్లండ్‌ 126 రేటింగ్‌ పాయింట్స్‌
2. భారత్‌ 123
3. దక్షిణాఫ్రికా 113
4. న్యూజిలాండ్‌ 112
5. పాకిస్తాన్‌ 102
6. ఆస్ట్రేలియా 100

>
మరిన్ని వార్తలు