ఎవరు బెస్ట్‌ వికెట్‌ కీపర్‌?

4 Oct, 2019 21:05 IST|Sakshi

కోల్‌కతా: ప్రపంచంలో ఉత్తమ వికెట్‌ కీపర్‌ ఎవరన్న ప్రశ్నకు టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. ‘సాహా మా బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టి ప్రపంచంలోనే అతడే అత్యుత్తమ కీపర్‌. రిషబ్‌ పంత్‌ కూడా కీపర్‌గా విజయవంతమయ్యాడు. సాహా బెస్ట్‌ కీపర్‌ అని, అతడు ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడాలని విరాట్‌ కోహ్లి కోరుకున్నాడ’ని గంగూలీ పేర్కొన్నాడు. సాహాను బెస్ట్‌ కీపర్‌గా కోహ్లి పేర్కొన్న సంగతి తెలిసింది. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిషబ్‌ పంత్‌ను పక్కనపెట్టి సాహాకు స్థానం కల్పించారు.

విశాఖ టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్‌గా ఫస్ట్‌ ఛాయిస్‌ అవుతాడనేది ఇప్పుడే చెప్పలేమని గంగూలీ అన్నాడు. ‘యువ ఆటగాళ్లు ఎవరు రాణించినా టీమిండియా అది కలిసొచ్చే అంశమే. ఆస్ట్రేలియాలో మయాంక్‌ బాగానే ఆడాడు. వెస్టిండీస్‌ పర్యటనలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ కొట్టాడు. కనీసం ఏడాది పాటు ఆడిన తర్వాతే అతడి ఆటను అంచనా వేయగలం​. అప్పటివరకు మయాంక్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వాల’ని గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ తన ఫామ్‌ను కొనసాగించాలని కోరుకున్నాడు. రోహిత్‌ బాగా ఆడితే భారత్‌ బ్యాటింగ్‌ బలం పెరుగుతుందన్నాడు.

>
మరిన్ని వార్తలు