ఎవరు నంబర్‌వన్‌  అనేది తేలే సమయం 

5 Jan, 2018 00:42 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

పరుగులు చేయడం, వికెట్లు తీయడం కంటే మాట్లాడటం తేలిక. ఇప్పుడిక అసలు ఆట ప్రారంభమైంది. రెండింటిలో ఏది నంబర్‌వన్‌ టెస్టు జట్టో తేల్చే సమయం వచ్చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుదీర్ఘ సిరీస్‌లో ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. రెండు జట్లకూ ఎంపికలో ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా పేసర్ల విషయంలో. తీవ్రమైన భుజం గాయం నుంచి డేల్‌ స్టెయిన్‌ కోలుకున్నాడు. కానీ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నాడా? రోజంతా బౌలింగ్‌ చేయగలడా? అతడి భుజం వేగంగా బంతులు విసిరేందుకు సహకరిస్తుందా? 400లకు పైగా వికెట్లు తీసిన అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా ఉండగలమా? ఒకవేళ మళ్లీ గాయపడితే? ఇదంతా దక్షిణాఫ్రికా సందిగ్ధత.  

ఏ సీమర్‌ను పక్కన పెట్టాలి... ఏ స్పిన్నర్‌ను ఆడించాలి? అనేవి భారత్‌ సందేహాలు. షమీ, భువనేశ్వర్‌ జట్టు తొలి ప్రాధాన్యత. వీరికి తోడుగా అదనపు పేస్‌తో పాటు, పాత బంతిని స్వింగ్‌ చేయగల ఉమేశ్, తిరిగి గాడిలో పడిన ఇషాంత్‌లలో ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడింది. జడేజా జ్వరం కారణంగా ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ ఖాయమే. కానీ... జడేజా కోలుకుంటే కోహ్లి ఎక్కువగా నమ్మే అతడికే అవకాశం ఉండొచ్చు. బ్యాటింగ్‌ విషయానికొస్తే ఓపెనర్లు సహా మిడిలార్డర్‌ గురించి టీమిండియాకు ఇబ్బంది లేదు. లోయర్‌ ఆర్డర్‌లో వికెట్‌ కీపర్‌ సాహా బ్యాటింగ్‌ సామర్థ్యం అదనపు బలం.  భారత ఫీల్డింగ్‌ గురించే కొంచెం ఆలోచించాలి. శ్రీలంక సిరీస్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినా అంతిమంగా విజయం దక్కింది. అయితే... జారవిడిచిన క్యాచ్‌లు గెలుపునే దూరం చేస్తాయని ఢిల్లీ టెస్టు నిరూపించింది. స్లిప్‌ చాలా కీలక ప్రాంతం. సుదీర్ఘ కాలంగా ఉత్తమ క్యాచర్‌గా ఉన్న రహానే సీమర్ల బౌలింగ్‌లో ఎప్పుడోగానీ క్యాచ్‌లు రాని గల్లీలో ఎందుకు?  ధావన్, అతడు 1, 2 స్లిప్‌లలో ఉండాలి. జట్టుగా బలంగా ఉన్న భారత్‌... మైదానంలో కనబరిచే ఆటపైనే సిరీస్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది.  

మరిన్ని వార్తలు