గావస్కర్‌ ‘కోటి రూపాయల’ ప్రశ్న!

23 Sep, 2019 12:59 IST|Sakshi

బెంగళూరు: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.  సాధారణంగా ఫీల్డ్‌లో మాత్రమే ఆసక్తికర సన్నివేశాలు, నాటకీయ పరిణామాలు కనబడుతూ ఉంటాయి. కామెంటరీ బాక్స్‌లో అయితే సదరు కామెంటేటర్లు తమ పని తాము సాఫీగా చేసుకుపోతూ ఉంటారు. అక్కడక్కడ క్రికెటర్లపై సుతిమెత్తగా విమర్శలు చేసినా అది తమ పనిలో  భాగంగానే భావిస్తారు. కాగా, దక్షిణాఫ్రికా-టీమిండియా మధ్య  చివరి టీ20లో కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తన  యాక్షన్‌తో ఇరగదీశాడు. అచ్చం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను అనుకరిస్తూ ప్రేక్షకులికి ఒక ప్రశ్న సంధించాడు.

కౌన్‌ బనేగా కరోడ్‌పతికి వచ్చిన పోటీ దారులికి అమితాబ్‌ ఏ రకంగా ప్రశ్నలు వేస్తాడో అచ్చం అలా అనుకరించిన సునీల్‌ గావస్కర్‌ ‘భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాల్గో స్థానంలో ఎవరు రావాలి’.. అంటూ నవ్వులు పూయించాడు. మరో భారత కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో కలిసి విధులు నిర్వహిస్తున్న క్రమంలో గావస్కర్‌  తన నోటికి పని చెప్పడంతో పాటు అమితాబ్‌ స్టైల్‌ను ఫాలో అయ్యాడు.  ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి బీసీసీఐ సైతం ముచ్చటపడి ఒక కామెంట్‌ను ట్వీటర్‌లో పోస్ట్‌  చేసింది.  ‘ ఇది సన్నీజీ నుంచి వచ్చిన బంగారం. గావాస్కర్‌  కేబీసీ అనువాదం ఎలా ఉంది. ఇది సన్నీ  జీ స్టైల్‌’ అంటూ కామెంట్‌ పెట్టింది. దీనికి ఫ్యాన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ‘ ఇది గావస్కర్‌ ‘కోటి  రూపాయల ప్రశ్న’ అని ఒకరు  పేర్కొనగా, ‘ గావస్కరా.. మజాకా’ అని మరొకరు ట్వీట్‌  చేశారు. ‘నాల్గో స్థానంపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని గావస్కర్‌ ఇలా అడగడం చాలా బాగుంది’ అని మరొక అభిమాని రిప్లూ ఇచ్చాడు.

గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానంలో సరైన ఆటగాడి కోసం భారత్‌ అన్వేషణ సాగిస్తూనే ఉంది.ఇప్పటికే చాలా మంది క్రికెటర్లను ఇక్కడ పరిశీలించినా ఎవ్వరూ సెట్‌ కాలేదు. చివరకు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను ఈ స్థానంలో పంపుతున్నా  అతను విఫలమవుతున్నాడు. నాల్గో స్థానంలో సరైన ఆటగాడ్ని వెతికడంలో గత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సక్సెస్‌ కాలేదు.  బంగర్‌ను తప్పించడం వెనుక కారణాల్లో ఇదొకటి. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ బాధ్యతలు  తీసుకున్నాడు. మరి నాల్గో స్థానంలో ఆకట్టుకునే ఆటగాడ్ని అన్వేషించడంలో రాథోడ్‌ ఎంత వరకూ విజయవంతం అవుతాడో  చూడాలి.


 

మరిన్ని వార్తలు