ఎవరీ యువ కెరటం..?

30 Jan, 2018 14:30 IST|Sakshi
శుభ్‌మాన్‌ గిల్ (బీసీసీఐ ట్విటర్‌ ఫొటో)

శుభ్‌మాన్‌ గిల్.. యువ టీమిండియాలో ఈ పేరు మార్మోగుతోంది. నిలకడగా రాణిస్తున్న ఈ యువ బ్యాట్స్‌మన్‌ తాజాగా అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో జట్టును టైటిల్‌కు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్తాన్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ బాదాడు. 94 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు(341) కూడా అతడివే.

ఈ కుడిచేతి వాటం టాపార్డర్‌ బ్యాట్స్‌మన్ అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో గిల్‌ మరింత రాటు దేలుతున్నాడు. దేశీయ మ్యాచుల్లో పంజాబ్‌ తరుపున ఆడుతున్న అతడు 2017, నవంబర్‌లో బెంగాల్‌తో తన మొదటి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన గిల్‌.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.

పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్‌ 8న శుభ్‌మాన్‌ గిల్ జన్మించాడు. అతడి తండ్రి రైతు. క్రికెటర్‌ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రిని ఒప్పించి కుటుంబంతో సహా మొహాలి తరలివెళ్లాడు. కఠోర సాధన, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాడు. 2014లో జరిగిన అండర్‌-16 పంజాబ్‌ అంతర్‌ జిల్లా టోర్నమెంట్‌లో 351 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. నిర్మల్‌ సింగ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 587 భాగస్వామ్యం నమోదు చేశాడు.

విజయ్‌ మర్చంట్‌ ట్రోఫిలో పంజాబ్‌ తరపున అరంగ్రేటం చేసిన అండర్-16 మ్యాచ్‌లోనే అజేయ డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. 2013-14, 2014-15లో వరుసగా రెండుసార్లు బెస్ట్‌ జూనియర్‌ క్రికెటర్‌గా బీసీసీఐ అవార్డు అందుకున్నాడు. తన అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చేతుల మీదుగా 2014లో అవార్డు అందుకుని మురిసిపోయాడు. తాజాగా నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో రూ.1.8 కోట్లకు గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది.

>
మరిన్ని వార్తలు