గంభీర్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

27 Feb, 2018 14:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11సీజన్‌ కోసం పలు జట్లు తమ జట్ల కెప్టెన్ల పేర్లను ఇప్పటికే ప్రకటించగా, కోల్‌కోతా నైట్‌రైడర్స్‌ జట్టు మాత్రం ఇంకా కెప్టెన్‌ అన్వేషణలోనే ఉంది. తొలుత ఆసీస్‌ పవర్‌ హిట్టర్‌ ఆటగాడు క్రిస్‌ లిన్‌ కేకేఆర్‌ సారథ్య బాధ్యతలు చేపడతాడని భావించినా... అతను గతవారం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీపీఎల్‌)లో గాయపడ్డాడు. దాంతో ఐపీఎల్‌ నాటికి లిన్‌ ఫిట్‌ అయినప్పటికీ, అతనికి కెప్టెన్సీని అప్పచెప్పడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలువురు కీలక ఆటగాళ్ల పేర్లను కెప్టెన్సీ పదవి కోసం కేకేఆర్‌ అన్వేషిస్తోంది.  ఇందులో దినేశ్‌ కార్తీక్‌తో పాటు రాబిన్‌ ఉతప్పలు ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి సారథ్య బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే సునీల్‌ నరైన్‌ పేరును కూడా కేకేఆర్‌ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందుగానే గౌతం గంభీర్‌ను కేకేఆర్‌ వదులుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ ఫ్రాంచైజీ తర్జన భర్జనలు పడుతోంది.

దినేశ్‌ కార్తీక్‌..

గత సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడిన దినేశ్‌ కార్తీక్‌.. 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్‌ల ఐపీఎల్‌ అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఇతనొక నమ్మకదగిన బ్యాట్స్‌మన్‌ కావడంతో పాటు వికెట్‌ కీపర్‌గా కూడా ప్రభావం చూపే క్రికెటర్‌. దాంతో దినేశ్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

రాబిన్‌ ఉతప్ప...

గత ఐపీఎల్‌ సీజన్‌లో ఉతప్ప 388 పరుగులు చేశాడు. కేకేఆర్‌ తరపున 14 మ్యాచ్‌ల్లో ఆడి ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 149 మ్యాచ్‌ల్లో 3,735 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 22 హాఫ్‌ సెంచరీలున్నాయి. 2014లో కేకేఆర్‌ టైటిల్‌ గెలవడంలో ఉతప్పది ప‍్రధాన పాత్ర. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 660 పరుగులు సాధించాడు.  

సునీల్‌ నరైన్‌..

మిస్టరీ స్పిన్నర్‌గా పేరున్న సునీల్‌ నరైన్‌.. 2012 నుంచి కేకేఆర్‌ జట్టుకు ఆడుతున్నాడు. ఆ సీజన్‌లో 24 వికెట్లు సాధించిన నరైన్‌.. కేకేఆర్‌ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను అందుకోవడం ముఖ్య పాత్ర వహించాడు. ఇక 2013లో 22 వికెట్లు సాధించిన నరైన్‌.. 2014లో 21వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2015లో 7, 2016లో 11, 2017లో 10 వికెట్ల చొప్పున నరైన్‌ సాధించాడు.

>
మరిన్ని వార్తలు