Who will triumph: MS Dhoni or Rahul Dravid?

4 Oct, 2013 03:43 IST|Sakshi
రాయల్స్‌ను ఆపగలరా!

సొంతవేదిక జైపూర్‌లో వరుసగా 12 మ్యాచ్‌లు నెగ్గిన జోరులో ఒక జట్టు...డైనమైట్ కెప్టెన్ నేతృత్వంలో టి20ల్లో సూపర్ రికార్డు ఉన్న జట్టు మరో వైపు...చాంపియన్స్ లీగ్‌లో మరో హోరాహోరీ సమరానికి రంగం సిద్ధమైంది. టోర్నీ తొలి సెమీ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అజేయ ద్రవిడ్ సేనను... జైపూర్‌లో ధోనిసేన నిలువరిస్తుందా?
 

రాజస్థాన్‌తో చెన్నై అమీతుమీ  చాంపియన్స్ లీగ్ తొలి సెమీస్ నేడు   సొంతగడ్డపై అద్భుత ఫామ్‌లో ద్రవిడ్ సేన  ఆత్మవిశ్వాసంతో ధోని బృందం  రాత్రి గం. 8.00 నుంచి స్టార్  స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం
 
 జైపూర్: ద్రవిడ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలవడం ద్వారా సొంతగడ్డపైనే సెమీస్ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది. మరోవైపు అద్భుతంగా ఆడిన ధోనిసేన ఆఖరి మ్యాచ్‌లో తడబాటు కారణంగా... జైపూర్ వెళ్లి రాజస్థాన్‌తో ఆడాల్సి వచ్చింది. మామూలుగా సూపర్ కింగ్స్ అద్భుతమైన జట్టే అయినా... రాయల్స్ సొంతగడ్డపై సాధిస్తున్న విజయాలు చూస్తుంటే, ధోనిసేనకు విజయం అంత తేలిక కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో రాజస్థాన్, చెన్నై తలపడుతున్నాయి. ధోనిసేన గతంలో చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలవగా... రాజస్థాన్ ఎప్పుడూ ఈ టోర్నీ ఫైనల్‌కు చేరలేదు.
 
 బ్యాటింగే బలం : గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైనా చెన్నై ప్రధాన బలం బ్యాటింగ్‌లోనే ఉంది. ఓపెనర్లుగా విజయ్, మైక్ హస్సీ తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. సురేశ్ రైనా అయితే తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్నాడు. కెప్టెన్ కూల్ ధోని దూకుడు జట్టుకు తారకమంత్రంగా పని చేస్తుందని చెప్పవచ్చు. బౌలింగ్‌లో మాత్రం చెన్నై అంత గొప్ప ప్రదర్శన కనబర్చడంలేదు. అశ్విన్ మినహా మిగతావారంతా ఆల్‌రౌండర్లే తప్ప రెగ్యులర్ బౌలర్లు కాదు. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టగల సామర్ధ్యం జట్టుకు ఉంది.
 
 నిలకడైన ప్రదర్శన : మరో వైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్రశాంతంగా లీగ్‌లో తమ పని చేసుకుపోతోంది. వ్యక్తిగతంగా చూస్తే ఎలాంటి అద్భుత రికార్డు ఎవరూ నమోదు చేయకపోయినా సమష్టిగా ఆ జట్టు ఓటమి ఎరుగకుండా నాలుగు విజయాలు అందుకుంది. ఇక జైపూర్‌లో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం కూడా ద్రవిడ్ బృందానికి కలిసొచ్చే అంశం. ద్రవిడ్, రహానే జట్టుకు కావాల్సిన మెరుగైన ఆరంభాన్ని అందిస్తుండగా...సామ్సన్, బిన్నీలాంటి యువ ఆటగాళ్లు కూడా తమ పరిధిలో రాణిస్తున్నారు. షేన్‌వాట్సన్, బ్రాడ్ హాడ్జ్‌లు చెలరేగితే వారికి ఆకాశమే హద్దు.  బౌలింగ్‌లో ఫాల్క్‌నర్‌తో పాటు తాజా సంచలనం రాహుల్ శుక్లాను జట్టు నమ్ముకుంది. తాంబే, కూపర్‌లకు ప్రత్యర్థికి పరుగులు ఇవ్వకుండా నిరోధించగల సామర్థ్యం ఉంది.
 

మరిన్ని వార్తలు