వెళ్లగొట్టారు...

3 Jan, 2017 00:06 IST|Sakshi
వెళ్లగొట్టారు...

బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు
ఠాకూర్,  షిర్కేలను తప్పిస్తూ ఉత్తర్వులు 
లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని ఫలితం
అనర్హులైన ఇతర ఆఫీస్‌ బేరర్లూ ఇదే జాబితాలోకి!


భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్‌ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్‌ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. 

న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీసీఐకి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్, కార్యదర్శి అజయ్‌ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన వాదప్రతివాదాలు, వాయిదాల అనంతరం సుప్రీం తన తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంతా హామీ పత్రం దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్‌ తీరథ్‌ సింగ్‌ (టీఎస్‌) ఠాకూర్, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పరిపాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటిస్తుంది. ఇందులో సభ్యుల కాగల అర్హత ఉన్నవారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్‌ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్‌ నారిమన్‌లకు కోర్టు సూచించింది. అప్పటి వరకు మాత్రం బోర్డులో సీనియర్‌ ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే సీఈఓ హోదాలో రాహుల్‌ జోహ్రి ఇప్పటి కే రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

రెండేళ్ల తర్వాత...
2013 ఐపీఎల్‌ సందర్భంగా బయటపడ్డ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్‌ రాజేంద్ర మల్‌ (ఆర్‌ఎం) లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది. ఏడాది తర్వాత 2016 జనవరిలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. చర్చోపచర్చలు, వాదనల తర్వాత గత ఏడాది జులై 18న లోధా సూచించిన వాటిలో ఎక్కువ భాగం ప్రతిపాదలను ఆమోదించిన సుప్రీం కోర్టు వీటిని పాటించాల్సిందంటూ బోర్డును ఆదేశించింది. అయితే ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ సమయం ఇచ్చినా కూడా బీసీసీఐ దీనిని పట్టించుకోలేదు. పైగా తమ రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోధా కమిటీకి తగిన విధంగా సహకరించలేదు. అధ్యక్షుడు ఠాకూర్‌ అయితే తన మాటలు, చేతల్లో లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. చివరకు ఈ పరిణామాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసేందుకు దారి తీశాయి. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమపై ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఠాకూర్, షిర్కేలను సుప్రీం ఆదేశించింది.

నాకు ఇబ్బంది లేదు: షిర్కే
సుప్రీం ఇచ్చిన తీర్పుతో కార్యదర్శి పదవిని కోల్పోవడాన్ని అజయ్‌ షిర్కే తేలిగ్గా తీసుకున్నారు. ‘దీనిపై ఏమని స్పందిస్తాం. నన్ను తప్పిస్తున్నట్లు సుప్రీం చెప్పింది కాబట్టి బోర్డులో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగత అనుబంధం లేదు. సభ్యులకు మద్దతుగా నిలబడాలి కాబట్టి సిఫారసులు అంగీకరించలేకపోయాం. అప్పట్లో పదవి ఖాళీగా ఉండి నా అవసరం ఉండటంతో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడానికి ఎలాంటి బాధా లేదు. నేను చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల వల్ల మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పరువు పోకూడదని కోరుకుంటున్నా’ అని షిర్కే అన్నారు.

రిటైర్డ్‌ జడ్జీలకు బెస్టాఫ్‌ లక్‌!
వ్యంగ్యంగా స్పందించిన ఠాకూర్‌

సుప్రీం కోర్టుతో నేరుగా తలపడే సాహసం చేసి తన పదవిని పోగొట్టుకున్న అనురాగ్‌ ఠాకూర్‌ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. తీర్పుపై స్పందిస్తూ ఆయన వ్యంగ్య రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ‘ఇది నా వ్యక్తిగత పోరు కాదు. ఒక క్రీడా సంఘం స్వతంత్రతకు సంబంధించిన అంశం. అందరు పౌరుల్లానే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. ఒకవేళ రిటైర్డ్‌ జడ్జీలు బీసీసీఐని సమర్థంగా నడిపిస్తారని సుప్రీం కోర్టు భావిస్తే వారికి బెస్టాఫ్‌ లక్‌ చెబుతున్నా. వారి నేతృత్వంలో భారత క్రికెట్‌ ఇంకా బాగుంటుందని నమ్ముతున్నా. సౌకర్యాలు, స్థాయి, క్రికెటర్లపరంగా చూసినా కూడా ప్రపంచంలోనే బీసీసీఐ అత్యుత్తమంగా నిర్వహించబడుతున్న సంస్థ’ అని ఠాకూర్‌ చెప్పారు.‘నేను ఉత్తర్వుల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇకపై బోర్డు మళ్లీ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నా’ – బిషన్‌ సింగ్‌ బేడి

‘సుప్రీం ఉత్తర్వులను బోర్డు అమలు చేయని ఫలితాన్ని ఇప్పుడు ఠాకూర్, షిర్కే అనుభవిస్తున్నారు’ – జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌

‘ముంబై క్రికెట్‌కు ఇదో విషాదకరమైన రోజు. ముంబై ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. 41 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటింగ్‌ హక్కు లేదనడం బాధాకరం’         – శరద్‌ పవార్‌

‘సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. మేం పాటిం చాల్సిందే’     – నిరంజన్‌ షా

మరిన్ని వార్తలు