ధోని హెల్మెట్‌పై జెండా ఎందుకు ఉండదంటే..

7 Mar, 2018 12:10 IST|Sakshi

సాక్షి స్పోర్ట్స్‌: భారత క్రికెట్‌ ఆటగాళ్లు ధరించే హెల్మెట్లు ఎప్పుడైనా పరీక్షగా చూశారా? చూసుంటే ఏమైనా కనిపెట్టారా? సచిన్‌, గంగూలీ, కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు అర్ధ సెంచరీ, సెంచరీలు చేసిన తర్వాత హెల్మెట్‌ను ముద్దాడం చూశారా? ధోని వారిలాగే ఎప్పుడైనా చేశాడా లేదా? వారందరూ ఎందుకు అలా చేస్తారో తెలుసా? తెలియక పోతే తెలుసుకోండి. వీటన్నింటికి సమాధానం ఒక్కటే.. అదే భారత జెండా. భారత క్రికెట్‌ ఆటగాళ్ల హెల్మెట్లపై బీసీసీఐ లోగోతో పాటు భారతీయ జెండా ఉంటుంది.

దేశం మొత్తం గర్వంగా భావించే జాతీయ జెండాను ధరించడం ఎవరైనా గొప్ప గౌరవంగా భావిస్తారు. అందుచేతనే సచిన్‌, సెహ్వాగ్‌లతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు అందరూ సెంచరీ పూర్తి చేయగానే హెల్మెట్‌ను ముద్దాడతారు. కానీ ధోని మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాడు. అలా అని ధోనికి దేశభక్తి లేదని కాదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా అలా చేయకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971 కింద ధోని క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే.

దేశం మొత్తం తలెత్తి సెల్యూట్‌ చేయాల్సిన జెండాను నేలపై ఉంచితే, భారతదేశాన్ని అవమానపరిచినట్లే. కీపింగ్‌ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్‌ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమాన పరిచినట్లు అవుతుంది. ఈకారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్‌పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

మరిన్ని వార్తలు