ధోనిని ఒప్పించి తప్పించారా?

26 Feb, 2018 12:41 IST|Sakshi

ముంబై: వచ్చే నెల్లో శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో పాల్గొనే భారత క్రికెట్‌ జట్టును ఆదివారం ప్రకటించారు. ముందుగా ఊహించినట్లుగానే భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ట్రై సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. అదే సమయంలో ఎంఎస్‌ ధోని కూడా లంక పర్యటనకు దూరం పెట్టారు. జట్టును ఎంపిక చేసే క్రమంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించిన టీమిండియా సెలక్టర్లు.. కోహ్లి, ధోని, హార్దిక్‌ పాండ్యా, జస్ర్నిత్‌ బూమ్రా, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతి నిచ్చారు. అయితే ధోనికి విశ్రాంతి ఇవ్వడంపైనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సఫారీ గడ్డపై మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ 20లు ఆడిన భారత సీనియర్‌ క్రికెటర్లు అలసిపోయారని.. రానున్న ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో వారికి విశ్రాంతి ఇచ్చామని సెలక్టర్లు చెబుతున్నారు. మరి ఇక్కడ ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఎప్పుడో టెస్టులకు గుడ్‌ బై చెప్పిన ధోని.. ఇప్పుడు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. మరి అటువంటప్పుడు సెలక్టర్లు చెప్పిన అలసిపోవడం ధోనికి వర్తించదు కదా..ఒకవేళ సఫారీ పర్యటనలో ధోని అలసిపోయాడనుకుంటే, మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు అలసిపోలేదు. వీరు కీలక క్రికెటర్లు కాదా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

ఇంకో కోణంలో ధోనినే విశ్రాంతి కావాలని కోరాడు.. అని సెలక్టర్లు చెబుతున్నారు. అంటే యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధోని సూచాయగా విశ్రాంతి అడిగి ఉండవచ్చు..లేక అతన్ని ఒప్పించి ఉండవచ్చు. గతంలో అంటే ఏడాది క్రితం ఇదే తరహాలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజాకు విశ్రాంతి ఇచ్చామన్నారు. ఆపై వాళ్లని వన్డే, టీ20 జట్టు నుంచి తప్పించారు. ఇప్పటకీ ఈ స్పిన్ జోడి పరిమిత ఓవర్ల జట్టులోకి పునరాగమనం చేయడానికి అపసోపాలు పడుతోంది. ఇందుకు కారణం కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌లు రాణించడమే. ఇది మంచి పరిణామమే. జట్టులో పోటీతత్వాన్ని ఎవరూ కాదనరు. ఇప్పుడు ధోని స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లని జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ ఈ టోర్నీలో ఎవరైనా మెరుగ్గా రాణిస్తే..? వచ్చే వరల్డ్‌ కప్‌కు ప్రపంచకప్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఉపయోగపడతాడనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారేమో..?

ధోని గతంలో మాదిరి ఆడలేకపోతున్నాడనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో సెలక్టర్లు వికెట్ కీపర్ వేటలో పడ్డారన్న వాదన తాజా సెలక్షన్‌కు అద్దం పడుతోంది. గత ఏడాది ఆరంభంలోనూ వన్డే, టీ20 కెప్టెన్సీలను ధోనినే స్వతహాగా వదులుకున్నాడని చెప్పారు. అయితే చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్ ప్రత్యేకంగా కలిసి ధోనితో మాట్లాడిన తర్వాతే పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పాడు. ధోనిని పొమ్మనలేక పొగబెట్టారనే అప్పట్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. మరి ఇప్పుడు కూడా ధోని ఇలానే ఒప్పించి.. తనే విశ్రాంతి తీసుకున‍్నాడని ప్రచారం చేస్తున్నారా? అనేది మాత్రం వారికే తెలియాలి.

మరిన్ని వార్తలు