శ్రేయస్‌ను రమ్మంటే.. పంత్‌ వచ్చేశాడు!

23 Sep, 2019 13:48 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకేసారి ఇద్దరు క్రికెటర్లు బ్యాటింగ్‌కు వచ్చారంటే అది ఓపెనర్ల విషయంలోనే మనం చూస్తాం. అటు తర్వాత ఒక బ్యాట్స్‌మన్‌ ఔటైతే ఒక బ్యాట్స్‌మన్‌ మాత్రమే ఫీల్డ్‌లోకి వస్తాడు. అయితే టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో రెండో వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ ఔటైన తర్వాత రిషభ్‌ పంత్‌-శ్రేయస్‌ అయ్యర్‌లు ఒకేసారి ఫీల్డ్‌లోకి వచ్చేశారు. ఇది ప్రేక్షకులతో పాటు క్రీజ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లిని కూడా ఆశ్చర్య పరిచింది. అసలు ధావన్‌ తర్వాత ఎవరు బ్యాటింగ్‌ చేయబోతున్నారనే దానిపై సందిగ్థత ఏర్పడింది. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చేసిన పొరపాటో, కోహ్లి చేసిన పొరపాటో కానీ ఇద్దరూ ఒకేసారి బ్యాటింగ్‌ చేయడానికి పోటీ పడటం ఆసక్తిని రేపింది.  అసలు నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ అనేది కొంతకాలంగా నిరాశ పరస్తుండగా ఇలా ఒకే సమయంలో ఇద్దరు ఆ స్థానం తనదనే రీతిలో పోటీ పడటం నవ్వులు తెప్పించింది. కాగా, చివరకు శ్రేయస్‌ను వెనక్కి తగ్గడంతో రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ చేపట్టాడు.

వివరాల్లోకి వెళితే.. సఫారీలతో చివరి టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(9)  ఆదిలోనే పెవిలియన్‌ చేరి నిరాశపరిచాడు. ఆ తర్వాత ధావన్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, ధావన్‌(36) మెరుపులు ఎంతో సేప సాగలేదు.  షమ్సీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో బావుమాకు క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లో ఉన్న కోహ్లి.. ఫలానా ఆటగాడ్ని పంపమంటూ సంకేతాలిచ్చాడు. దీనిపై క్లారిటీ లేకపోవడంతో బ్యాటింగ్‌ కోచ్‌ రాథోడ్‌ సందిగ్థంలో పడ్డాడు. ఈ క‍్రమంలో ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న అయ్యర్‌-రిషభ్‌లు తదుపరి బ్యాటింగ్‌ కోసం పోటీ పడ్డారు. వీరిద్దరూ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టేశారు కూడా.  అయితే చివరకు రిషభ్‌ పంత్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగగా, అయ్యర్‌ వెనక్కి వెళ్లిపోయాడు.(ఇక్కడ చదవండి: గావస్కర్‌ ‘కోటి రూపాయల’ ప్రశ్న!)

సమాచార లోపం వల్లే..
ఈ ఘటనపై మ్యాచ్‌ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. సమాచారం లోపం ఇలా జరిగిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇది కాస్త నవ్వులు పూయించినా ఎవరు రావాలనే దానిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇద్దరూ బ్యాట్‌ పట్టుకుని బయటకు వచ్చారన్నాడు.  10 ఓవర్ల తర్వాత రెండో వికెట్‌ పడితే పంత్‌ను నాల్గో స్థానంలో వెళ్లమని బ్యాటింగ్‌ కోచ్‌ చెప్పాడని, అదే సమయంలో 10 ఓవర్లలోపు రెండో వికెట్‌ పడితే శ్రేయస్‌ అయ్యర్‌ను వెళ్లమని చెప్పాడన్నాడన్నాడు. కాకపోతే ఈ విషయం సరిగా అర్ధం చేసుకోలేకపోవడంతో ఇద్దరూ ఒకేసారి ఫీల్డ్‌లోకి వచ్చారన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా