సంచలనం

17 Feb, 2015 00:56 IST|Sakshi
సంచలనం

చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం.... చలి చీమలన్నీ కలిసి పామును చంపగలవని. ఇప్పుడు ప్రపంచకప్‌లో చూశాం... చిన్న క్రికెటర్లే అయినా వెస్టిండీస్‌ను మట్టికరిపించగలరని. ఈసారి మెగా టోర్నీలో తొలి సంచలనం నమోదయింది. పసికూనగా పరిగణించిన ఐర్లాండ్.... వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. అదీ 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా...  టాప్ క్రికెటర్లంతా తలా ఓ చేయి వేసి చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని సాధించారు.

ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ‘బి’ గ్రూప్‌లో ఉన్న భారత్, పాక్ కూడా జాగ్రత్త పడాల్సిందే.

 
వెస్టిండీస్‌ను కంగుతినిపించిన ఐర్లాండ్    
మెరిసిన స్టిర్లింగ్, జాయ్స్, నీల్ ఓబ్రియాన్
305 పరుగుల లక్ష్యాన్ని 46 ఓవర్లలోనే ఛేదించిన వైనం   
సిమ్మన్స్ మెరుపు సెంచరీ వృథా

నెల్సన్: ఐర్లాండ్ చిన్న జట్టే అని లైట్ తీసుకున్నారో... లేక ఈసారికి కరీబియన్ల సత్తా ఇంతేనో... కారణం ఏదైనా గానీ మాజీ చాంపియన్ వెస్టిండీస్‌కు ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. సాక్స్‌టన్ ఓవల్ మైదానంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 304 పరుగులు చేసింది. ఒక దశలో  87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా... సిమ్మన్స్ (84 బంతుల్లో 102; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), స్యామీ (67 బంతుల్లో 89; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది.
 
ఐర్లాండ్ బౌలర్లలో డాక్రెల్ మూడు వికెట్లు తీశాడు. ఐర్లాండ్ జట్టు 45.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసి మరో 25 బంతులు మిగిలుండగానే నెగ్గింది. ఓపెనర్ స్టిర్లింగ్ (84 బంతుల్లో 92; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎడ్ జాయ్స్ (67 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), నీల్ ఓబ్రియాన్ (60 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు) అద్భుతంగా ఆడారు. ఈ త్రయం ధాటికి వెస్టిండీస్ బౌలర్లు తేలిపోయారు. టేలర్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
సిమ్మన్స్, స్యామీ సూపర్
ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ 23.3 ఓవర్లలో 87 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గేల్ (65 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్సర్) సహా టాప్ బ్యాట్స్‌మెన్ అంతా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే సిమ్మన్స్, స్యామీ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 21.1 ఓవర్లలోనే 154 పరుగులు జోడించడం విశేషం. చివర్లో రస్సెల్ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా చెలరేగడంతో విండీస్ 300 మార్కును అధిగమించింది.

మూడు భాగస్వామ్యాలు
భారీ లక్ష్యం కళ్లముందున్నా ఐర్లాండ్ తడబడలేదు. కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్ (23)తో కలిసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన స్టిర్లింగ్... రెండో వికెట్‌కు జాయ్స్‌తో కలిసి 106 పరుగులు జతచేశాడు. జాయ్స్, స్టిర్లింగ్ ఇద్దరూ చక్కగా ఆడారు. మధ్య ఓవర్లలో సింగిల్స్ తీస్తూనే... షార్ట్ బంతుల్ని అలవోకగా బౌండరీలు బాదారు. 8 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయిన స్టిర్లింగ్ అవుటయ్యాక... క్రీజులోకి వచ్చిన నీల్ ఓబ్రియాన్ కూడా జోరుగా ఆడాడు. ఓబ్రియాన్, జాయ్స్ కలిసి మూడో వికెట్ కు 11.3 ఓవర్లలోనే 96 పరుగులు జోడించారు. ఇక ఐర్లాండ్ గెలుపు లాంఛనమే అనుకున్న దశలో... విండీస్ బౌలర్లు పుంజుకుని నాలుగు వికెట్లు తీశారు. అయితే నీల్ ఓబ్రియాన్ చివరి వరకూ క్రీజులో నిలబడి ఐర్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు.
 
స్కోరు వివరాలు:-

వెస్టిండీస్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) మూనీ (బి) కె.ఓబ్రియాన్ 18; గేల్ (సి) కె.ఓబ్రియాన్ (బి) డాక్రెల్ 36; డారెన్ బ్రేవో రనౌట్ 0; శామ్యూల్స్ ఎల్బీడబ్ల్యు (బి) డాక్రెల్ 21; రామ్‌దిన్ ఎల్బీడబ్ల్యు (బి) డాక్రెల్ 1; సిమ్మన్స్ (సి) డాక్రెల్ (బి) సోరెన్‌సెన్ 102; స్యామీ (సి) డాక్రెల్ (బి) మూనీ 89; రస్సెల్ నాటౌట్ 27; హోల్డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 304
వికెట్ల పతనం: 1-30; 2-31; 3-78; 4-78; 5-87; 6-241; 7-302.
బౌలింగ్: మూనీ 7-1-59-1; సోరెన్‌సెన్ 8-0-64-1; మెక్‌బ్రైన్ 10-1-26-0;ఓబ్రియాన్ 9-0-71-1; డాక్రెల్ 10-0-50-3; స్టిర్లింగ్ 6-0-33-0.
 
ఐర్లాండ్ ఇన్నింగ్స్: పోర్టర్‌ఫీల్డ్ (సి) రామ్‌దిన్ (బి) గేల్ 23; స్టిర్లింగ్ (సి) రామ్‌దిన్ (బి) శామ్యూల్స్ 92; జాయ్స్ (సి) బ్రేవో (బి) టేలర్ 84; నీల్ ఓబ్రియాన్ నాటౌట్ 79; బాల్‌బిర్నీ (సి) బ్రేవో (బి) టేలర్ 9; విల్సన్ (సి) గేల్ (బి) టేలర్ 1; కెవిన్ ఓబ్రియాన్ రనౌట్ 0; మూనీ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (45.5 ఓవర్లలో 6 వికెట్లకు) 307
వికెట్ల పతనం: 1-71; 2-177; 3-273; 4-285; 5-290; 6-291.
బౌలింగ్: హోల్డర్ 9-1-44-0; రోచ్ 6-0-52-0; టేలర్ 8.5-0-71-3; రస్సెల్ 6-0-33-0; గేల్ 8-0-41-1; స్యామీ 3-0-25-0; శామ్యూల్స్ 4-0-25-1; సిమ్మన్స్ 1-0-12-0.
 
వాళ్ల కోచ్‌ది వెస్టిండీసే
ఐర్లాండ్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్. ఈ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ 2007 ప్రపంచకప్ తర్వాత ఐర్లాండ్ జట్టుతో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుదీర్ఘకాలంగా ఈ జట్టుకు కోచ్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా తన సొంత జట్టు వెస్టిండీస్‌పై ఐర్లాండ్ గెలవడంతో సిమ్మన్స్ పాత్ర కీలకం. అన్నట్లు ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన వెస్టిండీస్ క్రికెటర్ లెండిల్ సిమ్మన్స్... స్వయానా ఐర్లాండ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్‌కు మేనల్లుడు.
 
వాళ్లకిది అలవాటే!

ప్రతి ప్రపంచకప్‌లోనూ పెద్ద జట్లు కచ్చితంగా సీరియస్‌గా పరిగణించాల్సిన చిన్న జట్టు ఐర్లాండ్. ఎందుకంటే సంచలనాలు సృష్టించడంలో ఈ జట్టుకు మంచి చరిత్రే ఉంది. 2007 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను లీగ్ దశలోనే ఇంటికి పంపించిన ఘనత ఐర్లాండ్‌ది. అలాగే 2011లో ఇంగ్లండ్‌పై 328 పరుగులను ఛేదించి సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఈసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఐర్లాండ్ ఓడించింది. అయితే తాము దీనిని సంచలనం అనుకోవడం లేదని, ఈసారి ప్రపంచకప్‌లో తాము పెద్ద లక్ష్యాలతో ఆడుతున్నామని ఐర్లాండ్ క్రికెటర్లు చెబుతున్నారు.  ఐర్లాండ్ గతంలో చేసిన సంచలనాలను చూద్దాం.  -సాక్షి క్రీడావిభాగం
 
2007: పాక్‌కు షాక్
ఐర్లాండ్ తొలిసారి బరిలోకి దిగిన ప్రపంచకప్ ఇది. ఆ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌ను ‘టై’ చేసుకుంది. ఆ జట్టుకు అదే గొప్ప ఫలితం అనుకున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా టోర్నీ ఫేవరేట్లలో ఒకటైన పాకిస్తాన్‌పై 3 వికెట్లతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో పాక్‌ను 45.4 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడినా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నీల్ ఓబ్రియాన్ (72) రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 41.4 ఓవర్లలో 133 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టు ఉన్న గ్రూపులో రెండో స్థానంలో నిలిచి సూపర్-8కి అర్హత సాధించి పసికూనల పవర్‌ను చూపించింది. ఆ మ్యాచ్ పరాజయంతో పాక్... గ్రూపు దశలోనే ఇంటి ముఖం పట్టింది.
 
2011: ఇంగ్లండ్‌కు చుక్కలు
ప్రపంచకప్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని ఇంగ్లండ్‌పై 2011లో అందుకుంది. గ్రూపు ‘బి’లో తమ రెండో మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడిన ఐర్లాండ్ ఓటమి నుంచి గెలుపు బాట పట్టి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ స్కోరు చూశాక ఐర్లాండ్ గెలుస్తుందనే ఆలోచన ఎవరికీ రాలేదు. పైగా లక్ష్యఛేదనలో 111 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెవిన్ ఓబ్రియాన్ సునామీలా ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. ఓబ్రియాన్‌కు తోడు అలెక్స్ కుసాన్ (47), జాన్ మూనీ (33)లు రాణించడంతో 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 329 పరుగులు చేసి నెగ్గింది.

మరిన్ని వార్తలు