దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం.. సారథిగా డికాక్‌

13 Aug, 2019 19:47 IST|Sakshi

కేప్‌టౌన్‌:  టీమిండియాతో జరగబోయే టెస్టు, టీ20 సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా తన బలగాన్ని ప్రకటించింది. భారత పర్యటనలో సఫారీ జట్టు మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు జట్టులో పెను మార్పులు తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌ గిబ్సన్‌ కాంట్రాక్ట్‌ను పొడగించడం లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు సారథిగా వ్యవహరిస్తున్న డుప్లెసిస్‌ను కేవలం టెస్టులకే పరిమితం చేసింది. వైట్‌బాల్‌ క్రికెట్‌కు వికెట్‌ కీపర్‌ డికాక్‌ను సారథిగా ఎంపిక చేసింది. 

సీనియర్‌ ఆటగాళ్లు డేల్‌ స్టెయిన్‌, హషీమ్‌ ఆమ్లాలు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ను టెస్టు జట్టులోకి తీసుకుంది. డుప్లెసిస్‌పై ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతోనే పరిమిత క్రికెట్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పించామని.. అదేవిధంగా వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వరకు సారథిగా డికాక్‌కు తగిన అనుభవం లభించాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  డస్సన్‌ వైస్‌ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. 

ఇమ్రాన్‌ తాహీర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో స్పిన్‌ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసేందుకు కేశవ్‌ మహారాజ్‌తో పాటు యువ స్పిన్నర్లు ముత్తుసామి, డేన్ పీడ్ట్‌లను ఎంపిక చేసింది. ఇక భారత్‌ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా తొలుత టీ20 సిరీస్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 15న ధర్మశాలలో తొలి టీ20 జరగనుంది. అనంతరం అక్టోబర్‌ 2 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌లకు విశాఖపట్నం, రాంఛీ, పుణె నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

>
మరిన్ని వార్తలు