పిచ్ ను తప్పుపట్టాల్సిన పనిలేదు: కోహ్లి

7 Nov, 2015 19:03 IST|Sakshi
పిచ్ ను తప్పుపట్టాల్సిన పనిలేదు: కోహ్లి

మొహాలి: బ్యాటింగ్ లో చేసిన చిన్నచిన్న పొరపాట్ల వల్లే వరుసగా వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు వికెట్లను చేజార్చుకో్వడం వెనుక పిచ్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. బ్యాటింగ్ లో సాంకేతికంగా తప్పిదాలు చేసి వికెట్లను చేజార్చుకున్నారని  స్పష్టం చేశాడు. 'మొహాలి వికెట్ రాక్షస వికెట్ ఏమీ కాదు.  ఏ స్టేజ్ లో చూసుకున్నాబంతి విపరీతంగా  ఏమీ  టర్న్ కాలేదు.  బ్యాటింగ్ లో తప్పిదాల కారణంగానే వికెట్లను చేజార్చుకున్నారు. దాంతో బౌలర్ గేమ్ గానే  మారిపోయింది' అని కోహ్లి తెలిపాడు.

తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజాపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విజయంలో జడేజా పాత్ర అమోఘమని కొనియాడాడు. తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగుల చేయడమే కాకుండా, ఎనిమిది వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడని కోహ్లి పేర్కొన్నాడు. మురళీ విజయ్, చటేశ్వర పూజారాలు బ్యాటింగ్ లో రాణించడంతోనే దక్షిణాఫ్రికాను కట్టడి చేయడం సాధ్యమైందన్నాడు. మరికొన్ని పరుగుల లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచాలని భావించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

 

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం మూడో రోజు  218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు