కష్టాలను గెలిచి... విజేతగా నిలిచి

26 Jun, 2013 17:13 IST|Sakshi
కష్టాలను గెలిచి... విజేతగా నిలిచి

 ఆంధ్రప్రదేశ్ యువ వెయిట్‌లిఫ్టర్ రాహుల్ పురోగమనం
 అంతర్జాతీయస్థాయిలో స్థిరమైన ప్రదర్శన
 వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన
 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు
 
 రాష్ట్ర క్రీడా పాఠశాలలో చేరాలని ఆ అబ్బాయి చేసిన ప్రయత్నం ఆదిలోనే విఫలమైంది. అయితే ఆ కుర్రాడు మాత్రం నిరాశ పడలేదు. తండ్రి అండగా... పట్టుదలే పెట్టుబడిగా... సాధన చేయడం మొదలుపెట్టాడు. మూడేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. రాష్ర్టస్థాయిలో అతను కనబరిచిన ప్రదర్శన అందర్నీ ఆశ్చర్యపరిచింది.
 
  గతంలో ప్రవేశం నిరాకరించిన స్పోర్ట్స్ స్కూల్ అధికారులే అతణ్ని ఆహ్వానించి నేరుగా ప్రవేశం కల్పించారు. తాను కోరుకున్న చోట ప్రతిభకు మెరుగులు దిద్దుకొని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగిన అతనే గుంటూరు జిల్లాకు చెందిన రాగాల వెంకట్ రాహుల్. ఇటీవల ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు సాధించిన రాహుల్ భారత భవిష్యత్ వెయిట్‌లిఫ్టింగ్ ఆశాకిరణంలా ఎదిగాడు.
 
 సాక్షి, హైదరాబాద్/బాపట్ల
 గిరిజన కుటుంబం... వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రాగాల మధుకు క్రీడలంటే మాత్రం విపరీతమైన అభిమానం. గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురంకు చెందిన ఆయనకు ఆర్ధికంగా అండ లభించక తన ఆటను ఒక స్థాయికే పరిమితం చేసుకున్నారు.
 
 అయితే తాను సాధించలేనిదానిని పిల్లల ద్వారా అందుకోవాలని తపించిన ఆయన అందుకు తగిన విధంగా వారిని తీర్చిదిద్దారు. ఫలితంగా ఆయన కుమారుడు రాగాల వెంకట రాహుల్ వెయిట్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. మరో ఇద్దరు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రతిభకు పట్టుదల తోడైతే ఆటల్లో అగ్ర స్థానానికి చేరుకోవచ్చనేదానికి ఇదో ఉదాహరణ.
 
 ప్రవేశం లభించలేదు!
 వెయిట్‌లిఫ్టింగ్‌లో తగినస్థాయి శిక్షణ కోసం రాహుల్ ముందుగా 2005లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్)లో చేరాలనుకున్నాడు. అక్కడి మౌలిక సౌకర్యాలతో ఆటను నేర్చుకోవాలని భావించాడు. అయితే ప్రవేశ పరీక్షలో విఫలం కావడంతో నాలుగో తరగతిలో అతనికి అడ్మిషన్ లభించలేదు. ప్రవేశం దొరకలేదని అతను నిరాశపడలేదు. అప్పటికే ఆటలో ఓనమాలు నేర్చుకున్న రాహుల్ శిక్షణ కొనసాగిస్తూ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు.
 
  కబడ్డీ, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్న తండ్రి మధు స్వయంగా శిక్షణ ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాహుల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆ టోర్నీని ప్రత్యక్షంగా తిలకించిన స్పోర్ట్స్ స్కూల్ కోచ్ మాణిక్యాల రావు రాహుల్ ప్రతిభను గుర్తించి ఏడో తరగతిలో అవకాశం కల్పించారు.
 
 స్కూల్ గేమ్స్‌తో మొదలు...
 ఏపీఎస్‌ఎస్‌లో చేరగానే రాహుల్ విజయాల జోరు మొదలైంది. తొలి ఏడాది రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల్లో 3 స్వర్ణాలు నెగ్గి అందరి దృష్టినీ ఆకర్షించిన అతను మరో రెండు నెలలకే జాతీయ స్థాయిలో 3 కాంస్యాలు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ సబ్ జూనియర్స్, జూనియర్ నేషనల్స్, యూత్ నేషనల్స్... ఇలా ప్రతీ స్థాయిలో తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.
 
  ఇటీవల దోహాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రాహుల్ అద్భుత ప్రదర్శనతో 3 స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల రాహుల్ ప్రస్తుతం ఎన్‌ఐఎస్, పాటియాలలో భారత జట్టు క్యాంప్‌లో పాల్గొంటున్నాడు. త్వరలో జరిగే జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు కీలకమైన యూత్ ఒలింపిక్స్‌కు 77 కేజీల విభాగంలో సిద్ధమవుతున్నాడు. ఇక్కడ రాణిస్తే అతని తర్వాతి లక్ష్యం 2016 ఒలింపిక్స్ క్రీడలే.
 
 ఆ ఇద్దరూ...
 మధు తన మరో ఇద్దరు పిల్లల్ని కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో తీర్చి దిద్దుతున్నారు. అబ్బాయి వరుణ్, అమ్మాయి మధుప్రియ కూడా ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారు. భువనేశ్వర్, సాంగ్లీలలో జరిగిన జాతీయస్థాయి స్కూల్ గేమ్స్, జాతీయ ‘పైకా’ క్రీడల్లో వీరిద్దరూ పతకాలు సాధించడం విశేషం.
 
 రాహుల్ ప్రధాన ఘనతలు
 
  2012లో సమోవాలో జరిగిన యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
 
 స్లొవేకియా ఆతిథ్యమిచ్చిన 2012 యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం
 
 ఉజ్బెకిస్థాన్ వేదికగా ఈ ఏడాది జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం
 
 ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
 
 మే నెలాఖర్లో దోహాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో (2013) 3 స్వర్ణాలు
 
 ఎన్నో కష్టాలతో రాహుల్‌కు ఆట నేర్పించాను. స్పోర్ట్స్ స్కూల్‌లో చేరాక అతని భవిష్యత్తుపై ఆందోళన తగ్గింది. అయితే అతనికి స్పాన్సర్ల అవసరం ఉంది. రాహుల్ ఒలింపిక్ పతకం తేవాలనేది నా కోరిక. నా వద్ద ఉన్న పాత కాలపు మెటీరియల్‌తోనే ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాను. ఒక్క వెయిట్‌లిఫ్టింగ్ కిట్ కోసం ఎంతో మందిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఎవరైనా ముందుకొచ్చి ఆర్ధికంగా సహకరిస్తే బావుంటుంది.
 -రాగాల మధు, రాహుల్ తండ్రి
 
 నాకు తెలిసింది కష్టపడటమొక్కటే. గంటల పాటు సాధన, తీవ్ర శ్రమ కారణంగానే ఈ విజయాలు సాధించగలిగాను. నా నేపథ్యం గొప్పగా ఏమీ లేదు. ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. ఆట బాగా ఆడితేనే ముందుకెళతానని తెలుసు. అందుకే మరింత పట్టుదలగా సాధన చేస్తున్నాను. భారత శిబిరంలో ఉండటం నా అదృష్టం. 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా సిద్ధమవుతున్నాను.
 -రాహుల్, వెయిట్‌లిఫ్టర్
 
 రాహుల్‌లో సహజ ప్రతిభ ఉంది. గతంలో భారత్ తరఫున మహిళా వెయిట్‌లిఫ్టర్లు రాణించినా పురుషుల్లో ప్రదర్శన అంత గొప్పగా లేదు. తగిన విధంగా ప్రోత్సహిస్తే 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అతను సరైన దిశలోనే వెళుతున్నాడు.
 - కె. నర్సయ్య, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి
 

మరిన్ని వార్తలు