ఫుట్‌బాలర్‌ జాహా ఔదార్యం 

22 Mar, 2020 00:59 IST|Sakshi

తన అపార్ట్‌మెంట్‌లలో వైద్యులకు ఉచిత వసతి కల్పించిన ఐవరీకోస్ట్‌ ప్లేయర్‌  

లండన్‌: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు నిరంతరాయంగా శ్రమిస్తోన్న వైద్యులకు సాంత్వన కల్పించేందుకు ఐవరీకోస్ట్‌ యువ ఫుట్‌బాలర్‌ విల్‌ఫ్రెడ్‌ జాహా ముందుకొచ్చాడు. లండన్‌లో తనకున్న 50 వాణిజ్య ప్రాపర్టీలను ఉచితంగా వైద్యుల వసతి కోసం కేటాయించాడు. ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌లో క్రిస్టల్‌ ప్యాలెస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే జాహా ఈ లీగ్‌ ద్వారా వారానికి కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తాడు. ఈ ప్రాపర్టీలను కార్పొరేట్‌ క్లయింట్ల అవసరాల కోసం అందుబాటులో ఉంచే జాహా... వీటిని ఇంటికి వెళ్లేంత సమయం లేని వైద్యుల వసతి కోసం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. నాకు జాతీయ ఆరోగ్య సేవా సంస్థలో పనిచేసే స్నేహితులు ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తారో నాకు తెలుసు. ఆరోగ్య శాఖలో పనిచేసే వారు వీటిని ఉపయోగించుకోవచ్చు’ అని జాహా పేర్కొన్నాడు. జాహా కన్నా ముందు మాంచెస్టర్‌ యునైటైడ్‌ మాజీ స్టార్‌ ప్లేయర్‌ గ్యారీ నెవెలీ తన హోటల్స్‌లోని 176 గదులను, చెల్సీ యజమాని రోమన్‌ అబ్రామోవిచ్‌ 72 గదులను వైద్యుల కోసం కేటాయించారు.    

>
మరిన్ని వార్తలు