మన ఘనతపై మచ్చ

27 Jul, 2016 00:20 IST|Sakshi
మన ఘనతపై మచ్చ

ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 120 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌కు వెళుతున్నారని సంబరపడ్డాం. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం, ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటంతో రియోకు భారీ బృందం వెళుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సుమారు 10 పతకాలు మనోళ్లు తెస్తారని అంచనా. ఇప్పటికే ఆర్చరీ క్రీడాకారులు బ్రెజిల్ చేరిపోయి సాధన మొదలెట్టారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అమెరికా, యూరోప్‌లలో రకరకాల ప్రదేశాలలో ప్రాక్టీస్ చేస్తూ రియోకు సన్నద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో డోపింగ్ కలకలం వెలుగులోకి రావడం పెద్ద షాక్.
 
సాక్షి క్రీడావిభాగం: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినా అతడిపై ఎంతో కొంత సానుభూతి కనిపించింది. రెజ్లింగ్ సమాఖ్య కూడా నర్సింగ్ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని మద్దతుగా నిలబడింది. నర్సింగ్ అంశంపై చర్చ వాడిగా సాగుతున్న సమయంలోనే మరో అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ డోపింగ్‌లో దొరికిపోవడం మన ప్రతిష్టను దిగజార్చింది. గతంలో అడపాదడపా భారత అథ్లెట్లు డోపింగ్‌లో పట్టుబడ్డా... ఈసారి ఒలింపిక్స్‌కు ముందు భారీ అంచనాలతో ఉన్న అథ్లెట్లు దొరికిపోవడం దేశానికి చెడ్డపేరు తెస్తోంది.
 
భారత్‌లో క్రీడాకారులు డోపీలుగా దొరకడం ఇది తొలిసారేం కాదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలోనూ భారత్‌లో డోపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఇద్దరు వెయిట్‌లిఫ్టర్లు పట్టుబడ్డారు. దీంతో ఒక రకంగా వెయిట్‌లిఫ్టింగ్‌కు ఆదరణ బాగా తగ్గిపోయింది. 2000లో డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్, 2001లో కుంజరాణి, 2010లో సనామచా చాను కూడా డోపింగ్‌లో దొరికారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ఆదరణ పెరిగింది.

గత రెండు ఒలింపిక్స్‌లలో పతకాల సంఖ్య పెరగడంతో దేశంలో క్రీడాసంస్కృతి పెరిగింది. రియోకు వెళ్లే అథ్లెట్లకు ప్రభుత్వం భారీగా డబ్బు ఇచ్చింది. ‘టాప్’ స్కీమ్ పేరిట అందరికీ ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కూడా సహకారం అందించారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశలూ పెరిగాయి. అయితే ఆటల ప్రారంభానికి ముందే ఇద్దరు అథ్లెట్లు దొరకడంతో అందరిలోనూ సంశయం మొదలైంది.
 
క్లీన్‌చిట్ ఎలా ఇచ్చారు?
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత అథ్లెంట్లందరికీ వారం రోజుల క్రితం ‘క్లీన్‌చిట్’ ఇచ్చింది. రియోకు వెళుతున్న వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అందరూ క్లీన్ అని ప్రకటించింది. కానీ వారం తిరిగే సరికే ఇద్దరు అథ్లెట్ల పేర్లను అదే ‘నాడా’ బయటపెట్టింది. నిజానికి ఇప్పుడు బయటపడ్డ ఫలితాలు గత నెలలో తీసుకున్న శాంపిల్స్‌వి. మరి ఆ ఫలితాలను చూడకుండానే ముందుగా ఎందుకు ప్రకటన చేశారనేది ప్రశ్నార్థకం. అటు రెజ్లర్ నర్సింగ్ యాదవ్, ఇటు షాట్‌పుటర్ ఇందర్జీత్ ఇద్దరూ తాము అమాయకులమే అని, తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు.

ఒక అథ్లెట్ బ్లడ్, యూరిన్ శాంపిల్ ఇచ్చిన సమయంలో అథ్లెట్ సమక్షంలోనే దానిని లాక్ చేస్తారు. ఆ తర్వాత మిషన్ల సహాయంతో మాత్రమే వాటిని తెరుస్తారు. కాబట్టి అథ్లెట్ శాంపిల్‌ను మార్చారనే ఆరోపణల్లో నిజం లేదనుకోవాలి. ఇక నర్సింగ్ యాదవ్ చేసిన ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. అతడితో పాటు అతడి రూమ్‌మేట్ కూడా డోపింగ్‌లో దొరికాడు. ఈ ఇద్దరూ తినే ఆహారంలో ఏదో కలిపారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్లిద్దరూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణా కేంద్రంలోనే శిక్షణ తీసుకుంటున్నారు. హరియాణాలోని సోనేపట్‌లో ఉన్న ఈ కేంద్రంలోనే రెజ్లర్లందరికీ శిక్షణ ఇస్తున్నారు.

తనపై కుట్ర జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని నర్సింగ్ కోరుతున్నాడు. గతంలో నర్సింగ్‌కు మంచి రికార్డు ఉంది. ఎప్పుడూ ఏ స్థాయిలోనూ డోపింగ్‌కు పాల్పడిన ఆనవాళ్లు లేవు. ఇంతకాలం ఇంత క్లీన్‌గా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ సమయంలో డోపింగ్ చేయకపోవచ్చు. నిజానికి గత నెలలో అతనికి మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో రెండుసార్లు క్లీన్‌చిట్ వచ్చింది. మూడో సందర్భంలో బ్లడ్ శాంపిల్‌లో ఎలాంటి సమస్యా లేదు. కేవలం యూరిన్ శాంపిల్‌లో మాత్రమే తేడా ఉంది.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నర్సింగ్‌కు రెజ్లింగ్ సమాఖ్య నుంచే కాకుండా అన్ని వైపుల నుంచీ మద్దతు లభించింది.
 కానీ ఇందర్జీత్ విషయంలో పరిస్థితి అలా లేదు. భారత అథ్లెట్లందరికీ నిర్వహించే జాతీయ క్యాంప్‌లో ఇందర్జీత్ శిక్షణ తీసుకోలేదు. తన వ్యక్తిగత కోచ్‌తో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అలాగే ప్రతి నెలా క్రీడాకారులు తాము ఎక్కడ ఉండేదీ ‘నాడా’కు తెలపాలి. కానీ గత నెల ఇందర్జీత్ జూన్‌లో ఓ పరీక్షకు హాజరు కాలేదు. రెండో పరీక్షకు హాజరై దొరికిపోయాడు. అయితే ఇంకా తన ‘బి’ శాంపిల్ పరీక్ష ఫలితం రాలేదు.

ఒకవేళ ఆ పరీక్షలో కూడా అతను పాజిటివ్‌గా తేలితే ఇక రియోకు వెళ్లడం సాధ్యం కాదు. అంతేకాకుండా రెండు నుంచి నాలుగేళ్లు నిషేధం కూడా పడుతుంది. తమ కెరీర్‌లో ఒకసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. దీనిని సాకారం చేసుకోవడం కోసం ఏళ్ల పాటు కష్టపడతారు. కుటుంబాలను, వ్యక్తిగత సంతోషాలను వదిలేస్తారు. కాబట్టి కావాలని డోపింగ్‌కు పాల్పడే క్రీడాకారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది మరీ అత్యాశకు వెళతారు.

ఏదో ఒకటి చేసి పతకం గెలవాలనే ఉద్దేశంతో, పరీక్షలకు దొరక్కుండా రకరకాల మార్గాల ద్వారా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజూకూ మెరుగుపడుతున్నందున ఇలాంటివి దాగవు. తప్పు చేసిన అథ్లెట్ ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఏమైనా రియోకు ముందు ఈ పరిణామాలు ఎంతమాత్రం మంచివి కాదు. ఈ ఇద్దరితోనే ఇది ఆగిపోవాలని కోరుకుందాం.
 
ఇందర్‌జిత్ తీసుకున్న ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లొనోలోన్ రెండూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. జీవనిర్మాణ క్రియల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కండరాల పెరుగుదల, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఉత్ప్రేరకాలు బాగా దోహదపడతాయి. బరువైన వస్తువులు మోసే వాళ్లు లేదా శక్తిని బాగా ఉపయోగించే అథ్లెట్లు వీటిని తీసుకుంటారు. దీనివల్ల శరీరంలోని శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. షాట్‌పుట్, హామర్ త్రో అథ్లెట్లు ఈ డ్రగ్స్‌ను నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు ఒకే డ్రగ్‌ను లేదా రెండింటిని కలిపి తీసుకుంటారు.

మరిన్ని వార్తలు