'సెంచరీ'ల రికార్డుకు చేరువలో..

19 Sep, 2019 14:50 IST|Sakshi

విశాఖ: అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్‌ జట్టు ఒక రికార్డును ఒకసారి సృష్టించడమే గొప్ప. మరి అటువంటిది ఒకే రికార్డును రెండు సార్లు సాధిస్తే అది నిజంగా అద్వితీయమే. దాన్ని సుసాధ్యం చేసి చూపించింది భారత క్రికెట్‌ జట్టు. ఎప్పుడో 19 ఏళ్ల నాటి రికార్డును  కొన్నిరోజుల క్రితం టీమిండియా మరొకసారి సాధించింది. ఇంతకీ రికార్డు ఏమిటంటే.. అత్యధిక 'సెంచరీ'ల రికార్డు... ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత‍్యధిక వన్డే సెంచరీలు సాధించిన రికార్డు. 1998లో తొలిసారి 18 వన్డే శతకాల్ని సాధించి రికార్డు సృష్టించిన టీమిండియా.. 2017లో మరొకసారి ఆ మార్కును చేరింది. ఇటీవల శ్రీలంకతో మొహాలీలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఆ ఫీట్‌ను అందుకుంది. కాగా, ఇంకా ఒక సెంచరీ సాధిస్తే దక్షిణాఫ్రికా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో సాధించిన వన్డే సెంచరీల రికార్డును భారత్‌ అధిగమిస్తుంది. 2015లో సఫారీలు 18 సెంచరీలు సాధించి ఒకనాటి టీమిండియా రికార్డును సమం చేశారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం భారత్‌ ముందుంది. 

ఈ ఏడాది భారత్‌ జట్టు వన్డేల్లో నమోదు చేసిన సెంచరీల సంఖ్య 18. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సరసన భారత్‌ నిలిచింది. ఆదివారం విశాఖలో జరిగే మూడో వన్డేలో భారత జట్టు ఒక్క సెంచరీ సాధిస్తే, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలుస్తుంది.

ఈ ఏడాది భారత్‌ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రెండు సెంచరీలు చేయగా, అజింక్యా రహానే, కేదర్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు. లంకేయులతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్‌ జట్టు సెంచరీ నమోదు చేస్తే వన్డే క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా