సఫారీలకు ఈసారైనా షాకిస్తారా?

21 Feb, 2015 20:51 IST|Sakshi
సఫారీలకు ఈసారైనా షాకిస్తారా?

ఎప్పుడూ శాంతంగా కనిపించే హషీం ఆమ్లా ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు.. ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్లున్నారు.. సారథి డివిలియర్స్ 'ఫాస్టెస్ట్ సెంచరీ' ఊపుమీదున్నాడు.. తన పటిష్టతను ప్రదర్శించేందుకు మిడిల్ ఆర్డర్ సిద్ధంగా ఉంది.. ఇదీ సౌతాఫ్రికా జట్టు తాజా స్థితి.  ఇక భారత్ పరిస్థితి అందుకు కొద్దిగా భిన్నం. పీడకలలా వెంటాడుతున్న ఓటమి సెంటిమెంటు. ప్రత్యర్థితో పోల్చితే బలహీన బౌలింగ్.. కెప్టెన్ ధోనీ, రోహిత్ శర్మల ఫామ్ లేమి.. ఆశించినంతగా ఆకట్టుకోలేకపోతున్న జడేజా, అశ్విన్.. వీటన్నింటి నడుమ వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం జరగనున్న లీగ్ మ్యాచ్..  సౌతాఫ్రికా కంటే ఎక్కువ ఒత్తిడి భారత జట్టుకే ఉందనడంలో సందేహం లేదు. అయితే మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన ఉత్సాహం మరోసారి చూపిస్తే ఆ ఒత్తిడి దూదిపింజంలా ఎగిరి పోవడం ఖాయం. వరల్డ్ కప్లో సఫారీలపై వరుస ఓటముల సంప్రదాయానికి చరమగీతం పాడటమూ తథ్యం.

ఈ మ్యాచ్లో టాస్ నెగ్గితే భారత కెప్టెన్ ధోని కచ్చితంగా ఫీల్డింగే ఎంచుకుంటాడు. ఎందుకంటే..  1992, 1999, 2011  వరల్డ్ కప్ల్లో సౌతాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ భారత్కు కలిసి రాలేదు.  92 వరల్డ్ కప్లో ఆరు వికెట్ల తేడాతో, 99లో నాలుగు వికెట్ల తేడాతో, 2011లో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో సఫారీల చేతిలో భారత్ ఓటమిపాలైంది. అన్నిసార్లూ మొదటి బ్యాటింగ్ టీమిండియాదే. ఈ నేపథ్యంలో ధోనీ ఈసారి టాస్ గెలిస్తే 'ఫస్ట్ ఫీల్డింగ్'కే మొగ్గు చూపుతాడని అంచనా.  పాక్తో మ్యాచ్లో ధావన్, రైనా ఫామ్లోకి వచ్చారు కానీ రోహిత్ శర్మ, జడేజా, రహానే, ధోనీ పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. బౌలర్లలో మహ్మద్ షమీ (9 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు)  మంచి ఊపుమీదున్నాడు.  మన పేస్ త్రయం షమీ, ఉమేశ్, మోహిత్లో ఏ ఒక్కరు గాయం పాలైనా జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న 'మిస్టర్ కూల్' ధోనీ కెప్టెన్సీ సామర్థ్యంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకుల భావన.

ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బ్యాక్బోన్ హషీమ్ ఆమ్లా భారత్పై ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇటీవలే జరిగిన ఐసీఎల్ వేలంలో 'అమ్ముడుపోని ఆటగాడు'గా మిగిలిపోవడమే అతని కోపానికి కారణం! ఆదివారం జరిగే మ్యాచ్లో తన సత్తా ఏమిటో భారత ఫ్రాంచైజీలకు రుచిచూపించాలనే పట్టుదలతో ఉన్నాడు.  జింబాంబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్లో సఫారీలు 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. ఫస్ట్చేంజ్ బౌలర్గా వచ్చి 9 ఓవర్లు వేసిన డెల్ స్టెయిన్ ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ రెండూ భారత్కు సానుకూలాంశాలే.  వీటిని అవకాశాలుగా మలచుకుని సఫారీలను చిత్తుచేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు