-

విరాట్ సేన నిలుపుకుంటుందా?

28 Sep, 2017 14:43 IST|Sakshi

బెంగళూరు: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ను ఇప్పటికే టీమిండియా 3-0తో  కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలను నమోదు చేసిన విరాట్ సేన సిరీస్ ను సాధించడంతో పాటు నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్ ను 4-1 తో ముగిస్తేనే టీమిండియా నంబర్ వన్ ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ కానిపక్షంలో మళ్లీ తన ర్యాంకును కోల్పోవాల్సి ఉంటుంది.  దాంతో సిరీస్ ను దక్కించుకున్న విరాట్ సేన.. ఇప్పుడు టాప్ ర్యాంకును కాపాడుకోవడంపై కన్నేసింది.

నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. ఆసీస్ కెప్టెన్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపాడు. గత మ్యాచ్ లో సైతం టాస్ గెలిచిన స్మిత్ సేన ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఓటమి పాలైంది. మరొకవైపు గత జులైలో వెస్టిండీస్‌ చేతిలో నాలుగో వన్డేలో పరాజయం తర్వాత భారత్‌ మళ్లీ ఓడలేదు. విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై కలిపి వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ ఏడాది జనవరి తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. విదేశీ గడ్డపై ఆడిన గత 11 వన్డేల్లో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. అద్భుత ఫామ్‌తో మన జట్టులో ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చెలరేగుతుంటే... అటు కంగారూలు గెలవటం ఎలాగో మరచిపోయి బేలగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా పదో వన్డేలో విజయం సాధించి భారత్‌ తరఫున కొత్త రికార్డు నెలకొల్పాలని కోహ్లి సేన భావిస్తుండగా... సిరీస్‌ కోల్పోయాక పరువు కాపాడుకునే ప్రయత్నంలో స్మిత్‌ బృందం మరో పోరుకు సిద్ధమైంది. అయితే ఆస్ట్రేలియా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. మ్యాక్స్ వెల్ స్థానంలో మాథ్యూ వేడ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా, భారత జట్టు మూడు మార్పులు చేసింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు, పేసర్లు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానాల్లో అక్షర్ పటేల్ , మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లు తుది జట్టులోకి వచ్చారు.

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్

ఆసీస్ తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరో్న్ ఫించ్, ట్రావిస్ హెడ్, స్టోనిస్, హ్యాండ్ స్కాంబ్, మాథ్యూవేడ్, ప్యాట్ కమిన్స్ , కౌల్టర్ నైన్, రిచర్డ్ సన్, ఆడమ్ జంపా

మరిన్ని వార్తలు