మిథాలీ వీడ్కోలు పలకనుందా?

26 Nov, 2018 19:52 IST|Sakshi

ముంబై : మహిళా క్రికెట్‌లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఈ హైదరాబాదీ స్టార్‌ బ్యాటర్‌కు తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు భగ్గుమన్నారు. అయితే ఈ అవమానాన్ని మిథాలీ తట్టుకోలేకపోతుందని, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

వాస్తవానికి మిథాలీ ఈ ప్రపంచకప్‌ టోర్నీలో అద్భుతంగా రాణించింది. రెండు మ్యాచ్‌ల్లో అర్థశతకాలతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌కు గాయం కారణంగా ఆమెకు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లోను ఆమెను ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్‌లో భారత మహిళలు మిథాలీని పక్కన పెట్టినందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. దారుణంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. 

ఇక సెమీస్ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడంతో మిథాలీ చాలా బాధపడిందని ఆమె వ్యక్తి గత కోచ్‌ మీడియాకు తెలిపారు. సెమీఫైనల్‌ రోజు ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత ఆమె ఆడటం లేదని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే మిథాలీ నోట వీడ్కోలు మాట రాలేదు కానీ.. ఈ టోర్నీ ముందు ఆమె ఇదే తన చివరి టీ20 వరల్డ్‌కప్‌ అని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచకప్‌ విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న ఆమెకు ఘోర అవమానం జరగడంతో తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో 51.17 సగటులో అత్యధికంగా 6550 పరుగుల చేసింది. గత 20 ఏళ్లుగా భారత మహిళా క్రికెట్‌లో రాణిస్తున్న ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎందరో క్రికెట్‌ వైపు అడుగులేస్తున్నారు. అలాంటి మిథాలీకి ఈ తరహా అవమానం జరగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు