అంతదాకా చూస్తా... ఆ తర్వాతే గుడ్‌బై! 

24 Apr, 2018 01:01 IST|Sakshi

యువరాజ్‌ సింగ్‌ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ తర్వాత రిటైర్‌ కానని భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ చెప్పాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ తర్వాతే కెరీర్‌కు గుడ్‌బై చెబుతానన్నాడు. ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ మీడియాతో మాట్లాడుతూ ‘ఏ ఫార్మాట్‌ క్రికెటైనా 2019 వరకు ఆడతా. ఆ ఏడాది ముగిశాకే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. ఆటగాళ్లకు రిటైర్మెంట్‌ తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు వీడ్కోలు పలకాల్సిందే. నేనైతే 2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నా. సుమారు 17, 18 ఏళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తున్న కాబట్టి 2019 తర్వాత రిటైరవుతాను’ అని అన్నాడు. గత డిసెంబర్‌లో ‘యో–యో’ ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైన యువీని భారత సెలక్టర్లు దక్షిణాఫ్రికా పర్యటన, నిదహస్‌ ట్రోఫీ (శ్రీలంక)లకు పట్టించుకోలేదు.

కుర్రాళ్లవైపే మొగ్గు చూపారు. కానీ యువరాజ్‌ మాత్రం ఇంగ్లండ్‌లో వచ్చే యేడు జరిగే వన్డే ప్రపంచకప్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ మెగా టోర్నీలో అనుభవజ్ఞుడిని పరిశీలిస్తే తనకు చోటు దక్కుతుందని ఆశిస్తున్నాడు. 36 ఏళ్ల ఈ వెటరన్‌ స్టార్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టి20లు ఆడాడు. ఐపీఎల్‌లో తన పంజాబ్‌ సహచరుడు క్రిస్‌ గేల్‌పై యువీ ప్రశంసలు కురిపించాడు. ‘మేమిద్దరం ఎప్పట్నుంచో ఫ్రెండ్స్‌. ప్రపంచ క్రికెట్‌లో భయానక బ్యాట్స్‌మన్‌ గేల్‌. స్టేడియంలో అతనే ఒక బాస్‌. అతని విధ్వంసక బ్యాటింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం’ అని అన్నాడు.   

>
మరిన్ని వార్తలు