మరో రికార్డుకు చేరువలో కోహ్లి

30 Jul, 2018 15:53 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: సుదీర్ఘ పర్యటన కోసం  విరాట్‌ కోహ్లి గ్యాంగ్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ టెస్టుకు బర్మింగ్‌హామ్‌ వేదిక కానుంది. అయితే, ఇక‍్కడ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించినట్లయితే కెప్టెన్‌గా కోహ్లి అరుదైన క్లబ్‌లో చేరతాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లి 21 టెస్టు విజయాలతో భారత మాజీ కెప్టెన్ గంగూలీతో సమంగా ఉన్నాడు. అంతేకాదు టీమిండియాకు అత్యధిక విజయాలను అందించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో గంగూలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి నాయకత్వంలో టీమిండియా స‍్వదేశంలో 13 టెస్టులు గెలిస్తే, విదేశాల్లో 8 విజయాలు నమోదు చేసింది. ఈ సిరీస్‌లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఒక్క టెస్టు గెలిచినా కెప్టెన్‌గా కోహ్లి 22వ టెస్టు విజయాన్ని నమోదు చేస్తాడు.

అగ్రస్థానంలో ధోని..

టీమిండియా తరఫున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్లలో ఎంఎస్‌ ధోని తొలి స్థానంలో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లో కెప్టెన్‌గా 27 విజయాల్ని ధోని సాధించాడు. ఇందులో  ధోనిసేన 21 టెస్టు మ్యాచ్‌లను స్వదేశంలో గెలవగా, విదేశాల్లో 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు