‘ప్రపంచ క్రికెట్‌లో వారిద్దరే అత్యుత్తమం’

27 Apr, 2020 13:26 IST|Sakshi

వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై గతంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.  విలియమ్సన్‌ ఒక ప్రత్యేకమైన ఆటగాడని కోహ్లి కొనియాడాడు.  ఎప్పుడూ విజయం కోసం పోరాడే విలియమ్సన్‌ది ఒక అసాధారణమైన బ్యాటింగ్‌ శైలి అని కోహ్లి అభివర్ణించాడు. తాజాగా కోహ్లిని పొగడ్తల్లో ముంచెత్తాడు విలియమ్సన్‌.  వరల్డ్‌ క్రికెట్‌లో కోహ్లి అత్యుత్తమ ఆటగాడని విలియమ్సన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్‌లో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లే అత్యుత్తమం అని విలియన్స్‌ పేర్కొన్నాడు.  ప్రస్తుత శకంలో కోహ్లి, డివిలియర్స్‌లే బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అని కొనియాడాడు. (‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’)

‘కోహ్లి అన్ని ఫార్మాట్‌లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. కోహ్లితో ఆటను చూడాలన్నా, అతనితో తలపడాలన్నా చాలా ముచ్చటగా ఉంటుంది. కోహ్లి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పటికే కోహ్లి ఎన్నో ఎత్తులను చవిచూశాడు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌ మాత్రమే ఆడుతున్న ఏబీ అరుదైన బ్యాట్స్‌మన్‌. క్రికెట్‌ కోసమే పుట్టిన ఆటగాడు. అతనొక అసాధారణ ఆటగాడు. మన టైమ్‌లో ఏబీ ఒక స్పెషల్‌ ప్లేయర్‌. ఎంతో మంది క్వాలిటీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కోహ్లి-ఏబీలే బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌’ అని విలియన్స్‌ పేర్కొన్నాడు.  ఐపీఎల్‌ సహచర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌తో  ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌ చాట్‌లో ఎదురైన ప్రశ్నకు విలియమ్సన్‌ పైవిధంగా జవాబిచ్చాడు.(బుమ్రాకు ‘చుక్కలు’ చూపించాడు..!)

ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇ​క టీ20 ఫార్మాట్‌లో కోహ్లి 10వ స్థానంలో ఉన్నాడు. ఒ​​క సక్సెస్‌ఫుల్‌ సారథిగా ఉన్న  విలియమ్సన్‌.. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో  కివీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇప్పటివరకూ 80 టెస్టు మ్యాచ్‌ల్లో 6,476 పరుగులు చేసిన విలియమ్సన్‌.. 151 వన్డేల్లో 6,173 పరుగులు సాధించాడు. టెస్టుల్లో విలియమ్సన్‌ యావరేజ్‌ 50కి పైగా ఉండటం విశేషం. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా