విలియమ్సన్‌ రికార్డు సెంచరీ 

24 Mar, 2018 00:54 IST|Sakshi

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 229/4

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు  

ఆక్లాండ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న డే–నైట్‌ టెస్టులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (102; 11 ఫోర్లు, 1 సిక్స్‌) రికార్డు సెంచరీ నమోదు చేశాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన అతను అండర్సన్‌ బంతికి సింగిల్‌ తీయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు కివీస్‌ తరఫున రాస్‌ టేలర్, మార్టిన్‌ క్రో చెరో 17 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నారు.

తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడటంతో 23.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 175/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల వద్ద నిలిచింది. ఆరు వికెట్లు చేతిలో ఉన్న కివీస్‌ ప్రస్తుతం 171 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉంది. నికోల్స్‌ (49 బ్యాటింగ్‌), వాట్లింగ్‌ (17 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో అండర్సన్‌ 3 వికెట్లు పడగొట్టాడు.   

మరిన్ని వార్తలు