అందుకే ఓడిపోయాం: విలియమ్సన్‌

4 Jul, 2019 16:59 IST|Sakshi

చెస్టర్‌ లీ స్ట్రీట్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం చెందడం పట్ల న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో  పోరాడకుండానే చేతులెత్తేయడం నిరాశ కల్గించిందన్నాడు. ఈ వికెట్‌పై రెండో అర్థభాగంలో బ్యాటింగ్‌ చేయడానికి కష్టంగానే ఉన్నా తమ టాపార్డర్‌ కనీసం ప్రతిఘటించడంలో విఫలమైందన్నాడు. ప్రధానంగా భారీ భాగస్వామ్యాల్ని నమోదు చేయడంలో తమ జట్టు పూర్తిగా వైఫల్యం చెందిందని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: ఇంగ్లండూ వచ్చేసింది)

‘ ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ పిచ్‌ మొత్తం బౌలింగ్‌కే అనుకూలించింది. కానీ మేము పోరాట స్ఫూర్తి ప్రదర్శించడంలో కూడా విఫలమయ్యామనే చెప్పాలి. ఒక భారీ భాగస్వామ్యం నమోదైతే విజయం సాధించే అవకాశం వచ్చేది. అలా చేయడంలో సఫలం కాలేకపోయాం. మా బ్యాటింగ్‌ వైఫల్యంతోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెయిర్‌ స్టో, జేసన్‌ రాయ్‌లు శుభారంభం అందించారు. వారు సహజసిద్ధమైన బ్యాటింగ్‌తో పరుగులు సాధిస్తూ మాపై ఒత్తిడి పెంచారు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సగం పూర్తయ్యేసరికి వికెట్‌ మొత్తం మారిపోయింది. దాంతోనే ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం. ఏది ఏమైనా మా పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాం’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు