సూపర్ సెరెనా

8 Jul, 2016 02:06 IST|Sakshi
సూపర్ సెరెనా

వింబుల్డన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్
సెమీస్‌లో వెస్నినాపై గెలుపు
కెర్బర్ చేతిలో వీనస్‌కు చుక్కెదురు


లండన్: ప్రత్యర్థి అనుభవరాహిత్యాన్ని ఆసరాగా చేసుకున్న అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ... తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-2, 6-0తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఎలెనా వెస్నినా (రష్యా)పై గెలిచింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటికి ఆరుసార్లు విజేతగా నిలిచిన అమెరికన్ ఏడో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కేవలం 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా...  పదునైన సర్వీస్‌లు... తిరుగులేని ఏస్‌లు... బలమైన బేస్‌లైన్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కెరీర్‌లో 32వ గ్రాండ్‌స్లామ్ సెమీస్ మ్యాచ్ ఆడిన సెరెనా... 11 ఏస్‌లు, 28 విన్నర్లతో చెలరేగిపోయింది. ఏడు అనవసర తప్పిదాలు చేసినా... ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెరెనా కెరీర్‌లో ఇది 28వ స్లామ్ ఫైనల్. తొలిసెట్‌లో సెరెనా సర్వీస్‌లో వెస్నినా కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించగా, రెండో సెట్‌లో ఒక్కటీ నెగ్గలేదు. రష్యా ప్లేయర్ సెమీస్‌కు చేరడం ఇదే మొదటిసారి కావడంతో బ్యాక్ హ్యాండ్ షాట్లతో కోర్టులో చురుకుగా కదిలిన సెరెనా.. 28 నిమిషాల్లోనే తొలిసెట్‌ను ముగించింది. రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసి, రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకోవడంతో 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు, ఏడు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... ఆరు, ఎనిమిది గేమ్‌లను సెరెనా సర్వీస్‌తో దక్కించుకుంది. ఇక రెండో సెట్‌లో ఒకటి, మూడు, ఐదు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు మూడుసార్లు తన సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.

 
వీనస్ ఆశలు ఆవిరి

ఐదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్.. వింబుల్డన్‌లో నిరాశపర్చింది. ఏడేళ్ల తర్వాత టైటిల్ గెలవాలన్న ఆశలకు అడుగు దూరంలోనే నిలిచిపోయింది. రెండో సెమీస్‌లో ఎనిమిదోసీడ్ వీనస్ (అమెరికా) 6-4, 6-4తో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) చేతిలో ఓడింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... వీనస్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మూడు ఏస్‌లు, 24 విన్నర్లు సంధించిన ఈ అమెరికన్.. కీలక సమయంలో సర్వీస్‌లను చేజార్చుకుంది. మరోవైపు కెర్బర్ రెండు ఏస్‌లు, 17 విన్నర్లు సాధించింది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... యూఎస్ ఓపెన్ (2010) తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో సెరెనా.... కెర్బర్‌తో తలపడనుంది.   

 

మరిన్ని వార్తలు