ముర్రే శుభారంభం

4 Jul, 2017 00:25 IST|Sakshi
ముర్రే శుభారంభం

నాదల్, సిలిచ్‌ కూడా వింబుల్డన్‌ టోర్నీ
లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ముర్రే 6–1, 6–4, 6–2తో అలెగ్జాండర్‌ బుబ్‌లిక్‌ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. గంటా 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు అంతరాయం కలిగింది. మూడు ఏస్‌లు సంధించిన ముర్రే, నెట్‌ వద్ద 29 పాయింట్లు సాధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్‌ డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ)తో ముర్రే ఆడతాడు. మరోవైపు నాలుగో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), తొమ్మిదో సీడ్‌ కీ నిషికోరి (జపాన్‌) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో నాదల్‌ 6–1, 6–3, 6–2తో జాన్‌ మిల్‌మాన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి తన కెరీర్‌లో 850వ విజయాన్ని నమోదు చేశాడు.

క్విటోవా ముందుకు...
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), రెండో సీడ్‌  హలెప్‌ (రొమేనియా), నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌లో క్విటోవా 6–3, 6–4తో లార్సన్‌ (స్వీడన్‌)పై, హలెప్‌ 6–4, 6–1తో ఎరాకోవిచ్‌ (న్యూజిలాండ్‌)పై, స్వితోలినా 7–5, 7–6 (10/8)తో బార్టీ (ఆస్ట్రేలియా)పై, వీనస్‌ 7–6 (9/7), 6–4తో మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై గెలిచారు.

వీనస్‌ కంట కన్నీరు
తొలి రౌండ్‌లో మెర్‌టెన్స్‌పై గెలిచాక మీడియా సమావేశానికి హాజరైన మాజీ చాంపియన్‌ వీనస్‌ కన్నీళ్లపర్యంతమైంది. జూన్‌ 9న ఫ్లోరిడాలో వీనస్‌ డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో వీనస్‌ కారు ఢీకొని 78 ఏళ్ల జెరోమ్‌ బార్సన్‌ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇటీవలే మరణించాడు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి వీనస్‌ను మీడియా ప్రశ్నించగా ఆమె భోరున విలపించింది. ‘ఆ సంఘటనపై స్పందించేందుకు నా నోట మాటలు రావడంలేదు. ఆట మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేను’ అని వీనస్‌ వ్యాఖ్యానించింది. ఇప్పటివరకైతే వీనస్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.

మరిన్ని వార్తలు