వోజ్నియాకీ ఇంటిబాట

5 Jul, 2019 21:42 IST|Sakshi

వింబుల్డన్‌ చాంపియన్‌షిప్స్‌

లండన్‌: వింబుల్డన్‌ టోర్నీలో మాజీ నెం.1, 14వ సీడ్‌ కరోలిన్‌ వోజ్నియాకీ(డెన్మార్క్‌) కథ ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో వోజ్నియాకీ 4–6, 2–6తో ప్రపంచ 50వ ర్యాంకర్‌ జంగ్‌(చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌) 3–6, 6–2, 4–6తో షీ వూ హీష్‌(తైవాన్‌)పై, ఎనిమిదో సీడ్‌ ఎలినా స్వితోలినా(ఉక్రెయిన్‌) 6–3, 6–7(1/7), 6–2తో సక్కరి(గ్రీస్‌)పై చెమటోడ్చి నెగ్గగా, వరల్డ్‌ నెం.20 కొంటావీట్‌(ఎస్తోనియా) 7–6(9/7), 6–3తో ముచుకోవా (చెక్‌రిపబ్లిక్‌) చేతిలో పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌(దక్షిణాఫ్రికా) 4–6, 3–6, 6–7(4/7)తో పెల్లా(అర్జెంటీనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మిలాస్‌ రావోనిక్‌(కెనడా) 6–7(7/1), 2–6, 1–6తో ఒపెల్కా(అమెరికా)పై, బెన్నెట్‌ పైర్‌(ఫ్రాన్స్‌) 5–7, 7–6(7/5), 6–3, 7–6(7/2)తో వెస్లీ(చెక్‌రిపబ్లిక్‌)పై చెమటోడ్చి నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. పదో సీడ్‌ కచనోవ్‌(రష్యా) 3–6, 6–7(3/7), 1–6తో ప్రపంచ 22వ ర్యాంకర్‌ బటిస్టా అగట్‌(స్పెయిన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 

ప్రిక్వార్టర్స్‌కు దివిజ్‌ జోడీ
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌ జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దివిజ్‌(భారత్‌)–డెమోలైనర్‌(బ్రెజిల్‌) ద్వయం 7–6(1) 5–7 7–6(6) 6–4 తో సాండర్‌ గిల్లీ– జొరాన్‌ వెలీజెన్‌(బెల్జియం) జంటపై చెమటోడ్చి నెగ్గింది. కాగా, డబుల్స్‌లో ఇప్పటికే రొహన్‌ బొపన్న, లియాండర్‌ పేస్, పురవ్‌ రాజా, నెడుంజెళియన్‌ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు