గాఫ్‌ సంచలనాల జోరు

4 Jul, 2019 23:27 IST|Sakshi

వింబుల్డన్‌ చాంపియన్‌షిప్స్‌

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ చాంపియన్‌ షిప్స్‌లో అమెరికా యువ తార కోరి గాఫ్‌ (అమెరికా) సంచనాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వాలిఫికేషన్‌ ద్వారా వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ప్రవేశించి, ఈ రికార్డు సాధించిన తొలి 15 ఏళ్ల అమ్మాయిగా చరిత్ర కెక్కిన గాఫ్‌... అనంతరం మెయిన్‌ డ్రాలో ఐదుసార్లు వింబుల్డన్‌ చాంపియన్, నాలుగు సార్లు రన్నరప్‌ వీనస్‌ విలియమ్స్‌ను ఇంటిదారి పట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రౌండ్‌లోనూ అదే ఆటతీరును పునరావృతం చేసింది. వరల్డ్‌ నెం.313 గాఫ్‌ 6–3, 6–3తో 2017 వింబుల్డన్‌ సెమీఫైనలిస్టు మగ్దలినా రిబరికోవాపై గెలుపొందింది.

తద్వారా 1991 తర్వాత ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్స్‌లో మూడో రౌండ్‌కు చేరిన యువ క్రీడాకారిణిగా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తాజా నెం.1, టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) 6–1, 6–3తో వాన్‌ యుక్వాంత్‌(బెల్జియం)పై, తొమ్మిదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌(అమెరికా) 6–0, 6–2తో యఫాన్‌ వాంగ్‌(చైనా)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరారు. వోజ్నియాకీ(డెన్మార్క్‌), హలెప్‌ (రొమేనియా) కూడా ముందంజ వేశారు. పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ జకోవిచ్‌(సెర్బియా), నాలుగో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌(దక్షిణాఫ్రికా), జాన్‌ మిల్‌మాన్‌(ఆస్ట్రేలియా) సైతం తదుపరి రౌండ్‌కు చేరారు. 

మరిన్ని వార్తలు